Thursday, March 14, 2013

రోజుకో పద్యం

మన పిల్లలకు రోజుకు ఒక పద్యం నేర్పండి.

తమ్ముడు నాగ సాయి సూరి, తెలుగు వ్యాకరణం రచించిన పరవస్తు చిన్నయ సూరి గారికి  మునిమనవడు . వాళ్ళ అన్నయ్య శేష సాయి సూరి గారు తెలుగు పద్యంపై, భాషపై అభిమానంతో వైజాగ్ లో 'పరవస్తు విద్యా పీఠం ' స్థాపించారు. భాషాభిమానం ఉండడం గొప్ప విషయం కాదు. కాని భాషా వ్యాప్తి కోసం శేషసాయి గారు , సొంత లాభం మాని, తన సంపాదన లోంచి ఐదు లక్షలు పక్కకి పెట్టుకున్నారు. ఇక ఈ ఉచిత తరగతుల్లో ,ఒక్క పద్యం నేర్చుకుని చక్కగా చెప్పిన పిల్లలకు పది రూపాయల బహుమతి ఎదురు ఇచ్చారు. ఇలా ఇప్పటికి మూడు లక్షలు పద్యాలు చెప్పిన పిల్లలకు, బహుమానంగా ఇచ్చారంటే, ఇప్పటికి యెంత మంది పిల్లలకు ఎన్ని పద్యాలు నేర్పి ఉంటారో ఊహించండి. ఈ సారి 'తెలుగు వెలుగు' పత్రికలో శేషసాయి గారిపై ప్రత్యెక వ్యాసం ప్రచురించబడింది. పద్యం వల్ల  పిల్లలకు ధారణా శక్తి, భాషపై పట్టు మాత్రమె కాక ఏ బడుల్లోనూ నేర్పించని లోక జ్ఞానం అబ్బుతుంది. అందుకే మన పెద్దలు మనకు చిన్ని చిన్ని కధలు, సామెతలు, పద్యాల రూపంలో జీవిత పాఠాలు నేర్పేవాళ్ళు.

శేషసాయి గారి గురించి చదివాకా, నాకూ నా పిల్లలకి పద్యాలు నేర్పించాలన్న కోరిక కలిగింది. ఎప్పుడు...ఎలా? ప్రతీ రోజూ పడుకునే ముందు నేనే ఎందుకు నేర్పించకూడదు ? అన్న ఆలోచన వచ్చింది. అంతే ...పది రూపాయల పధకం అమలు చేసాను. చిత్రం, మొదటి రోజే ఉప్పు కప్పురంబు ...వచ్చేసింది. రెండవ రోజు గంగి గోవు పాలు..... అసలు, మన తెలుగింటి పిల్లలకు నోరు తిరగక పోవడం ఉండదండీ...కావాలంటే ప్రయత్నించి చూడండి . కాకపొతే కొన్ని తిప్పలు తప్పవు. ఉప్పు కప్పు అవుతుంది , పప్పులో కప్పు అవుతుంది, కప్పులో కప్ప అవుతుంది. ఖరము ఖర్మ అవుతుంది. ఇవన్నీ మాటల్లో ఆటవిడుపులు.  రోజూ మనం ఇచ్చే పది రూపాయిలు దగ్గరుండి వాళ్ళ కిట్టీ బ్యాంకు లో వేయిద్దాం. పొదుపు, సంస్కృతీ వ్యాప్తి...ఉభయతారకంగా ఉంటుంది. తెలుగు తల్లులూ చక్కటి పద్యాలు, శ్లోకాలు, మన పిల్లలకు మనమే నేర్పిద్దాం. నా ఈ ప్రయత్నం మరేవ్వరికయినా ప్రేరణ కలిగిస్తే అంతే చాలు. ధన్యవాదాలు. 

1 comment:

  1. సాలభంజికల కథలను సరలమైన తెలుగులో అందించినందుకు కృతజ్ఞతలు...... శ్రమ తీసుకుని మిగిలిన కథలను కూడా ప్రచురించగలరు.

    ReplyDelete