Sunday, June 23, 2013

తెనాలి రామలింగడు - కోలాహల పండితుడి కధ

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు . ఈ ఎనమండుగురు కవులను చిటికెన వేలితో ఓడించి , వాళ్ళు దిగ్గజాలు కాదు, చిట్టెలుకలు అని రుజువు చేస్తానని, దమ్ముంటే సభ ఏర్పాటు చెయ్యవలసిందని , లేకపోతే ఓడిపోయినట్టు వప్పుకుని సంతకాలు చేసి ఇవ్వమని , వర్తమానం పంపించాడు . దీనితో సభలో కలకలం మొదలయ్యింది . 

" యెంత ధైర్యం ?"
"అష్ట దిగ్గజాలు అంటే ఏమనుకుంటున్నాడు ?"
"మరీ ఇంత గర్వమా ?"
" ఆ కొలాహాలుడి మదం అణచాల్సిందే !"

ఈ విధంగా అందరూ తలో మాటా అన్నారు. కాని, కోలాహలుడు మాత్రం తక్కువ వాడు కాదు. ఆరు శాస్త్రాల్లోనూ నిధి అని ఎన్నో బిరుదులు గెలుచుకున్నాడు . అతడి ముందు గెలవలేమని , ఎవరికి వారే భయపడసాగారు. ఈ రొంపి లో నుంచి, తమను బయట పడవేయగలవాడు తెనాలి రామలింగడు ఒక్కడే అని తీర్మానించుకుని, తమ మధ్య విభేదాలు మరచి, ఏదో దారి చూపవలసిందని , రామలింగడిని కోరారు. 

రామలింగడు పశువుల కాపరి వేషం వేసుకుని, ఊరి బయట చెరువు గట్టు దగ్గర చెట్టు మొదలుకి జేరబడి, పిల్లన గ్రోవి ఊదుతూ, కోలాహల పండితుడి రాక కోసం ఎదురు చూడసాగాడు . తూరుపు తెల్లవారుతుండగా, కోలాహాల పండితుడు పేరుకు తగ్గట్టు కోలాహలంగా, వంద మంది శిష్యులను వెంటబెట్టుకుని వస్తూ కనిపించాడు.

అతడు రామలింగడిని చూసి, 'ఏయ్, ఇలా రా,' అంటూ నిర్లక్ష్యంగా పిలిచాడు. 
 
                                       

రామలింగడు సంభ్రమంగా లేచి, తలపాగా సర్దుకుని, వినయంగా వంగి, 'దండాలండి', అన్నాడు . 
' విజయనగరానికి వెళ్ళాలి . దారి తెలుసునా?'
'తెలవకేవండి , నాకు ఊరంతా కొట్టిన పిండేనండీ బాబయ్యా!'
'అష్టదిగ్గజాల పేరు విన్నావా?'
'ఇనక పోడం  ఏటి బాబయ్యా, వాళ్ళలో చిన్నాయన,  తెనాలి రామలింగయ్య గారి కాడే నేను పాలేరు పని జేసేది.'
'ఆయన గొప్ప కవి అని విన్నాను, నిజవేనా?'
'ఆరింట్లో అంటా కవులెనన్దీ. ఆరి సావాసం వల్ల నాక్కూడా, పజ్జాలు అల్లడం వచ్చేసినాదండి . '
'ఆహా, ఏది మచ్చుకు ఒకటి చదువు, విని, నీలాంటి జానపదుడికి కాస్త డొక్కా శుద్ధి అయినందుకు సంతోషిస్తా!'

నరసింహ కృష్ణ రాయని
కర మరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !


ఈ పద్యం వింటున్న కోలాహల పండితుడు ఆశ్చర్యంతో నోరు తెరచి, ముయ్యడం మరచిపొయాడు . ఆయన శిష్యులు రెప్ప వెయ్యడం మరచిపొయారు. వారిలో చాలా మందికి ఇది అర్ధమే కాలేదు . కోలాహలుడు , 'అందరిలోకి చిన్నవాడయిన రామలింగడి పాలేరుకే ఇంత పాండిత్యం ఉంటే , ఇక పెద్దవాడయిన అల్లసాని పెద్దన పాండిత్యం అంచనాలకు అందనిది, అందరిలో అవమానపడడం కంటే, వెనక్కి మర్యాదగా వెళ్ళిపోవడమే మంచిది ' అనుకున్నాడు . ముందుకు అడుగు వేసేందుకు కూడా అతడికి ధైర్యం చాలలెదు. పల్లకి వెనక్కి తిప్పించుకుని పారిపోయాడు . ఇంతకీ ఆ పద్యం అర్ధం ఏమిటంటే .... 

కీర్తిని తెలుపు రంగుతో పోల్చడం కవుల అలవాతు. ఆ నరసింహ దేవరాయల కొడుకయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తి ఎలా ఉందంటే, క్రింది తెల్లని వస్తువుల వలె , ఆ జాబితా ... 
 
కరిభిత్ = కరి అంటే ఏనుగు , భిత్ అంటే చంపినవాడు, ఏనుగుని భేదించినవాడు .. గజాసురుని అంతమొందించిన శివుడు, వేదాలలో శివుని  కీర్తి లాగా. 
గిరిభిత్ కరి = గిరి అంటే కొండ . పర్వతాలను భేదించినవాడయిన ఇంద్రుడి     తెల్లనైన ఏనుగు ఐరావతము లాగా . 
కరిభిత్ గిరి = ఎల్లప్పుడూ తెల్లని మంచుతో కప్పబడిన శివుని పర్వతం .... కైలాసము లాగా . 
గిరిభిత్ = పర్వతాలను చేదించడానికి వాడిన ఇంద్రుని వజ్రాయుధం, దాని తెల్లని రంగు లాగా . 
కరిభిత్ తురంగ = ఇక్కడ తురంగమంటే మనం వాహనంగా అర్థం చేసుకోవాలి. కనుక శివుని వాహనమైన తెల్లటి నంది లాగా . 
గిరిభిత్ తురంగ = ఇంద్రుని అశ్వము ఉచ్చైశ్రవము, ఇది కూడా తెలుపు. ఆ  దివ్యాశ్వం లాగా . 

ఇలా కృష్ణదేవ రాయల వారి కీర్తి తెల్లగా మనోహరంగా ఉన్నదట . కరి, గిరి, భిత్ అనే మాటలను తిరగేసి , మరగేసి ఎన్నో రకాల అర్ధాలు వచ్చేలా పద్యం అల్లి, కోలాహల పండితుడు పలాయనం చిత్తగించేలా చేసాడు రామలింగడు . 
 
 

Friday, June 14, 2013

అవకతవక మహారాజు కధ



అవకతవక మహారాజు కధ 
------------------------------------
పంచ మహాపాతక పట్టణాన్ని అవకతవక మహారాజు పాలిస్తూ ఉండేవాడు .రంగన్న అనే దొంగ అర్ధరాత్రి సోమయాజులు గారి ఇంటికి కన్నం వేసేందుకు గొయ్యి తవ్వి, లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వానకు బాగా నాని ఉన్న మట్టి గోడ కూలి అతడు మరణించాడు. మర్నాడు రంగన్న పెళ్ళాం రంగమ్మ శోకండాలు పెడుతూ, ఈ విషయం మహారాజు వద్ద ఫిర్యాదు చేసింది. 

అవకతవక మహారాజుకు శిక్షలు వెయ్యడం మహా సరదా. ముందూ వెనుకా ఆలోచించకుండా, న్యాయ విచారణ జరపకుండా, తోచినది చేసేయ్యడమే ఆ రాజు గారి ప్రత్యేకత. ఫిర్యాదు వింటూనే, 'ఆ ఇంటి యజమానిని లాక్కురండోయ్ ..' అంటూ భటులను పంపాడు.

వాళ్ళు వెంకప్ప సోమయాజుల్ని లాక్కు వచ్చి, రాజు ముందు నిలబెట్టారు. సోమయాజులు వణికిపోతూ, తన పేరు చెప్పి, తాను పౌరోహిత్యం చేస్తూ ఉంటానని చెప్పాడు. 

"పౌరోహిత్యం చేసే వాడివి రంగన్నను ఎందుకు చంపావు ? " అని గద్దించాడు రాజు.
" మట్టితో అశ్రద్ధగా గోడ కట్టి, రంగన్నను చంపినందుకు నీకు మరణ దండన విధిస్తున్నాను ",అన్నాడు రాజు.
 

సోమయాజులు గడగడా వణికిపోయాడు . 
'మా ఇంటి గోడను నేను కట్టలేదు ప్రభూ . రామన్న మేస్త్రి కట్టాడు . తప్పంతా అతనిదే !'
'అయితే ఇతడిని వదిలేసి, రామన్న మేస్త్రిని తీసుకు రండి,' అన్నాడు రాజు '. 
బ్రతుకు జీవుడా అంటూ జారుకున్నాడు సోమయాజులు . భటులు రంగాన్న మేస్త్రిని తీసుకు వచ్చారు . 
'నువ్వు ఇంటి గోడ నిర్లక్ష్యం గా కట్టి, పాపం దొంగతనం చేసుకోడానికి వచ్చిన రంగన్న చావుకు కారణం అయ్యావు. అందుకు నీకు మరణ శిక్ష విధిస్తున్నాను,' అన్నాడు రాజు . 
రామన్న రావి ఆకులా వణికిపోయి, వెంటనే ఉపాయం ఆలోచించి, ఇలా అన్నాడు . 'ప్రభూ! అడుసు తొక్కిన అప్పన్న సరిగ్గా తోక్కక పోవడం వల్లే గోడ కూలింది, నా తప్పేమీ లేదు,' 
'అయితే, ఇతన్ని వదిలి అప్పన్నను తెండి, ' ఆజ్ఞాపించాడు అవకతవక రాజు . 
మరణ శిక్ష తప్పించుకునేందుకు అప్పన్న, ' మట్టిలో నీరు పోసిన నారిగాడు చానా పోసేసి పల్చగా చేసేసాడు, తప్పు వాడిదే,' అంటూ చెప్పి, తప్పించుకున్నాడు . 
వెంటనే నారి గాడిని సభకు తెచ్చారు. 'నేను నీళ్ళు పోసిన కుండ మూతి చాలా వెడల్పుగా ఉంది .  ఆ కుండ చేసిన కుమ్మరి గురవయ్యదే తప్పు ,' అన్నాడు . 
గురవయ్య రాజుతో, ' నేను కుండ చేస్తుండగా భోగం పిల్ల కలావతి టక్కు - టిక్కు నడుస్తా, నాకేసి సూస్తా యెల్లిన్దన్ది. తప్పు ఆ పిల్లదేనండి ,' అన్నాడు . 
కళావతి  రాజ సభలో మెలికలు తిరుగుతూ , ' నేను మామూలుగా ఆ కుమ్మరి వీధిలో చస్తే అడుగుపెట్టను . వస్తే నా ఇంటికి ఎవడయినా రావాలి కాని, ఒకడింటికి వెళ్ళే ఖర్మ మాకేంటండి ? ఆ కంసాలి కామయ్య రవ్వల హారం చేసిస్తానని , ఎంతకీ ఇవ్వలేదు , అందుకే తప్పు అతనిదే, ' అంది . 
రాజు కామయ్యకి మరణ శిక్ష ఖరారు చేసేసాడు . ఈ సంగతి తెలిసిన అతడి బావమరిది భద్రయ్య , అక్కడికి వచ్చి , ' దేవర వారు కామయ్యకు బదులుగా నన్ను ఉరితియ్యండి . ఈ నాడు సూర్య గ్రహణ సమయంలో , ఉరితీయబడ్డ వాడు , మళ్ళి జన్మలో ఈ దేశానికి రాజు అవుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది . ,' అన్నాడు . 
అంతా విన్న అవకతవక రాజు , 'ఓరి దొంగ వెధవల్లారా, నా సింహాసనానికే ఎసరు పెడతారా ? జన్మ జన్మలకీ ఈ రాజ్యం నాదే, ఇంకొకరికి దక్కనివ్వను , నేనే ఉరిస్తంబం ఎక్కుతాను,' అంటూ, ఉచ్చు మెడకు తగిలించుకుని, ఉరి పోసుకున్నాడు . 
[పుస్తక సేకరణ - రేపు మరో కధ ]



బాలానాం రోదనం బలం

బాలానాం రోదనం బలం 
-----------------------------

ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే, వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు. అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది . 

పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం . అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ, ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు . ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి . ఏమయ్యిందో అని వెళ్లి చొస్తే, నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి, నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .కారణం అడగ్గా, 'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . 


'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది, ఆ వాక్యానికి అర్ధం అది కాదు, పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు . 

"పక్షీణాం  బలమాకాశం 
మత్స్యానా ముదకం బలం 
దుర్బలస్య బలం రాజా 
బాలానాం రోదనం బలం "

ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది . ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి . అలాగే చేపలకు నీళ్ళు బలం . బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం . చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం . ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక , అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది . అంతే  కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు . పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు అని పెద్దలకు చేసిన హితవు, అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,అని వివరించాడు చెంచయ్య . మీకూ  తెలిసింది కదూ... 


తెనాలి రామలింగడు - లతాంగి కధ

తెనాలి రామలింగడు - లతాంగి కధ
----------------------------------
నెల్లూరుకు పూర్వం సింహపురి అన్న పేరు ఉండేది . అప్పట్లో వెలయాళ్ళు కూడా  శాస్త్ర పారంగతులయ్యి, నెరజాణలు అనిపించుకునే వాళ్ళు. సింహపురి లో లతాంగి అనే వెలయాలు మిక్కిలి అందచందాలు, పాండిత్య ప్రతిభ కలిగి, పండితులకు ఒక సవాలు విసిరింది. ప్రత్యక్ష రామాయణం కళ్ళకు కట్టినట్లు చెప్పిన వారిని తానూ వివాహం చేసుకుంటానని, తనకు నచ్చేట్టు అలా చెప్పలేని వాళ్ళు తనకు దాస్యం చెయ్యాలని, షరతు విధించింది . ఎందరో పండితులు ఏంటో రసవత్తరంగా చెప్పినా, ఆమె వంకలు పెట్టి, వాళ్ళ చేత దాస్యం చేయించుకునేది . ఈమె సంగతి తెలిసిన రామలింగడు, ఆమె వద్దకు వెళ్లి , ఇలా అన్నాడు . 

'సుందరీ, నీ ప్రతిభాపాటవాల గురించి విన్నాను. నీకు ప్రత్యక్ష రామాయణం హృద్యంగా వినిపించేందుకే వచ్చాను. అయితే, నాదొక నియమమ్. నేను కధ చెప్పటం ముగించే దాకా, నీవు మాట్లాడ కూడదు . ' దానికామె తన అంగీకారాన్ని తెలిపింది . 



రామాయణం అద్భుతంగా చెప్పసాగాడు తెనాలి రాముడు . ఆమె మాటిమాటికీ 'కళ్ళకు కట్టినట్టు చెప్పట్లేదు, ' అనసాగింది . రామలింగడు ఆమెను మాట్లాడవద్దని సైగ చేస్తూ , చివరికి 'లతాంగీ, ఇకపై కధ నీ కళ్ళకు కట్టినట్టే చెబుతా చూడు , ' అంటూ, 'హనుమంతుడు మహేంద్రగిరి కొండ ఇలా ఎక్కాడు, ' అంటూ ఆమె మంచం ఎక్కి నిల్చున్నాడు . అక్కడి నుంచీ ఇంకొక కొండ పైకి ఇలా దూకాడు, అంటూ, మరొక మంచం మీదకు గెంతాడు . తరువాత లంకా నగరం ప్రవేశించి , లంకిణి ని ఇలా గుద్దాడు, ' అంటూ లతాంగి వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు . ఆమె గగ్గోలు పెట్టసాగింది . మధ్యలో మాట్లాడకు , పూర్తిగా విను అంటూ , 'సీతాదేవిని చూసి తిరిగి వచ్చేటప్పుడు లంకను ఇలా తగలబెట్టాడు, ' అంటూ కాగడా తీసుకుని, ఆమె మందిరం అంతా నిప్పు పెట్టి ,' చివరకు సముద్రం వద్దకు వెళ్లి, ఇలా హాయిగా స్నానం చేసాడు, 'అంటూ బావిదగ్గరకు వెళ్లి స్నానం చెయ్య సాగాడు . లతాంగి నెత్తి, నోరు బాదుకుని, న్యాయాధిపతి వద్దకు పరిగెత్తింది . అధికారి అందరి వాదనలూ విని, రామలింగడి తప్పేమీ లేదని తేల్చి, లతాంగిని మందలించి వదిలిపెట్టాడు . ఈ విషయం విన్న విజయనగర ప్రజలు ఘొల్లున నవ్వుకుని, రామలింగడి తెలివితేటలను అభినందించారు . 

సరదా సమయం

'ఏవండి, ఇవాళ టీవీ లో ఈ కొత్త వంటకం చూపించారు. కష్టపడి చేసాను ,రుచి చూసి, చెప్పరూ.'

'ఓ ఏదీ ఇటివ్వు. ఆహా, చిన్నప్పుడు తిన్న సబ్బు ముక్కను గుర్తుకు తెచ్చావు, ఇంతకీ ఈ పదార్ధం ఏవిటి తల్లి ?'

'ఉ తీ కా హల్వా ' అండీ. అంటే, ఈ హల్వా లో ఉప్పు, కారానికి పచ్చి మిరపకాయలు, తీపికి బెల్లం,వెయ్యాలన్నమాట. మొదటి అక్షరాలు కలిపి ఆవిడే ఆ పేరు పెట్టిందట. '

'అలాగా, యెంత సృజనో, పిచ్చి తల్లికి. ఇంతకీ ఈ వంటకం వండాకా ఆ వండిన శాల్తీ తిందా?'

'లేదండి, ఆంకరమ్మ తిని యెగిరి గంతేసింది.'

'వెంటనే వెనక్కి తిరిగి ఉమ్మేసి ఉంటుంది. నీ లాంటి గొర్రెలు ఆ ఆంకరమ్మ హావభావాలు చూసి, వెంటనే కొత్త వంటలు వండేసి ,ఇలా మంగళ సూత్రాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిగో, ఈ సారికి ఎలాగో నియంత్రించుకున్నాను గాని, ఇంకోసారి ఇలాంటి వంటకాలు చేసావంటే, ఇద్దరం ఎర్రగడ్డలో చేరాలి. నేను పేషెంట్ గా, నువ్వు నాకు ఆయాగా.'


=========================================================== 



'ఏంటి ఇప్పడిదాకా పడుకునే ఉన్నావా ? పొద్దుటే ఐదు గంటలకే లేచి, రెండు కిలోమీటర్ లు నడిచి, ఇంటికి వచ్చి, స్నానం చేసి, ఆరోగ్యకరమయిన అల్పాహారంతో చురుగ్గా రోజు ప్రారంభించాలి. లే లే '

'అంటే, మీరు రోజూ ఇలాగే చేస్తుంటారా ? ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ?'

'రేపటి నుంచీ మొదలుపెడదామని అనుకుంటున్నా !'
 ===========================================================================================
'నేను రచయిత్రిని కాదన్న వాళ్ళను రాయిచ్చుకు కొడతా!'

'అంత పని చెయ్యకు తల్లో , తమరు రచయిత్రే అని వప్పేసుకుంటున్నా.'

'భలే, అయితే,ఇప్పుడే పుట్టిన నవజాత కవిత, చకచకా చదివేస్తా,విని జన్మ ధన్యం చేసుకోండి. ముఖ్యంగా మీవంటి ఛాందసులు, నా వంటి కళాకారులు చేసే ఈ కొత్త ప్రయోగాల్ని చదివి అఘోరించాలి,'

'ప్రియా, హై వే లాంటి నా గుండె నిండా, నిర్దాక్షిణ్యంగా గోతులు తవ్వి వదిలేసావు. ఇప్పుడు ఆ గోతుల నిండా కన్నీళ్లు నింపుకుని, వానకు తడిసిన గుంతల రోడ్డులా ఉన్నాను. వచ్చి, నీ ప్రేమ మట్టితో పూడ్చేయ్యవూ,'

' ఇది కవితా, ఇది వినేకన్నా, ఆ రాయిచ్చుకు కొట్టించుకోవడమే మంచిది. నన్నొదిలెయ్ తల్లో , బ్రతికుంటే, బేబీ కార్న్ తిని బ్రతికేస్తా.'
============================================================================================





'మీ కవిగాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా, కాల్పనిక ప్రపంచంలో బ్రతికేస్తుంటారు, '

'కావచ్చు పూబోణి, అందువల్ల నష్టం ఏముంది? ఇప్పుడు, నువ్వు గుత్తి వంకాయ కూర వండాలే అనుకో, వంకాయలు తేవాలి, కారం నూరాలి, కాయల్లో కూరాలి, వండాలి. మాకంత కష్టం ఏమీ లేదమ్మా, వర్ణనలతో చంపేస్తాం,'

'మరీ మంచిది, రేపటి నుంచి వంట చెయ్యను, ఆ కల్పనల్లో తినేసి రండి, సరిపోతుంది.'

'దేవీ, క్షమ , దయ, వంకాయ కూరాం దేహి. స్త్రీ సహనశీలి, స్త్రీ ఇంటి లాంతరు , స్త్రీ వంటింట్లో పొయ్యి,'

'పొయ్యిలో పిల్లేమీ కాదు, ఈ కాకా వేషాలకేమీ తక్కువ లేదు కాని, ఈ సారికి క్షమిస్తున్నా. అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర ప్రదర్శించే ప్రయత్నాలు చెయ్యక, బుద్ధిగా శరణాగతి వేడండి. గుత్తి వంకాయ కూర ప్రాప్తిరస్తు!'


========================================================================


మా చిన్నప్పుడు పిల్లల వోప్పందాలు ఇలా ఉండేవి .

'ఒరేయ్ నువ్వు జీళ్ళు కొనుక్కున్నావు కదా, నాకొకటి ఇవ్వవా?'

'ఇవ్వను, ఇవన్నీ నాకే'

'మరి నిన్న నేను మొక్కజొన్న పొత్తు కొనుక్కుని, నీకు కొన్ని గింజలు పెట్టలేదూ, ఇవ్వకపోతే, నా గింజలు నాకు కక్కు,'

'సరే, బడి వదిలి పెట్టాకా, ఒకటి ఇస్తాలే,'

బడి వదిలేసరికి పిల్లవాడి మనసు మారిపోతుంది. మళ్ళి జీడి ఇవ్వనంటాడు. రెండవ పిల్లవాడికి ఉడుకుమోతు తనం వచ్చేస్తుంది.

'ఒరేయ్ , ఆశ పెట్టి, ఇవ్వకపోతే, నీకు ఆశ కురుపులు వస్తాయిరా, తిను, అన్ని నువ్వే తిను, రేపు నేను కూడా మా నాన్నని అడిగి, డబ్బులు తెచ్చుకుంటా, ఆ, '

సదరు ఆశ కురుపులని నేను ఎప్పుడూ చూడలేదు కాని, చిన్నప్పుడు నమ్మేసి, భయపడే వాళ్ళం.

ఈ పేస్ బుక్ లో ఇడ్లీ లు, దోషాలు, పునుకులు, పాణి పూరీలు పెట్టె వాళ్ళని చూస్తే, నాకెందుకో ఇలాగే అనాలని అనిపిస్తుంది. ' ఇదిగో, ఈసురో మంటూ ఆఫీసుల్లో, కాలేజీల్లో కూర్చుని, బుద్ధిగా పని చేసుకుంటూ, మధ్య మధ్య ఆటవిడుపుకు, మొబైల్ లో పేస్ బుక్ చూసే వాళ్ళని, ఇలా ఊరిస్తే ఆశ కురుపులు వచ్చేస్తాయి, జాగ్రత్త!'


==========================================================================================


'అదేవిటి ? ఇందాకటి నుండీ ఆ పుస్తకం మీద రసం పోస్తున్నావ్?"

" వాక్యం రసాత్మకం కావ్యం...అన్నారు కదండీ, ఈ కాగితం రసం పీల్చుకుని, కావ్యం అవుతుందేమో చూద్దామని..."

=========================================================================================


నవ జాత ప్రేమ కవిత...

ఎవయ్యోయ్...

అడగా పెట్టకుండా నా గుండెలో తిష్ట వేసుకు కూర్చున్నావ్ 

గొంతుకు కూర్చుని కొండముచ్చులా తొంగి చూస్తున్నావ్ 
ఏవిటయ్యా నీ దాష్టీకం? 

తాడో పేడో తేల్చక ఏవిటీ ముసుగులో గుద్దులాట ?

అర్జంటుగా తెల్చలేదో అప్పడాల కర్రిచ్చుకు కొడతా 

నాన్చీ నాన్చీ నస పెట్టావో నాలుగు తగిలిస్తా, జాగ్రత్త !

జడ పడతావో, లేక నన్నే తొడ కొట్టి రమ్మంటావో కాసుకో,

మీ ఇంటికొస్తా, పక్కింటికోస్తా, ఎదురింటికి వస్తా, హ హ హ (ఇక్కడో వికటాట్టహాసం వేసుకోండి ...)

=================================================================================

'ఏంటి ఇప్పడిదాకా పడుకునే ఉన్నావా ? పొద్దుటే ఐదు గంటలకే లేచి, రెండు కిలోమీటర్ లు నడిచి, ఇంటికి వచ్చి, స్నానం చేసి, ఆరోగ్యకరమయిన అల్పాహారంతో చురుగ్గా రోజు ప్రారంభించాలి. లే లే '

'అంటే, మీరు రోజూ ఇలాగే చేస్తుంటారా ? ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ?'

'రేపటి నుంచీ మొదలుపెడదామని అనుకుంటున్నా !'

==========================================================
కెఎస్ఎన్ మూర్తి 

ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రత్యేక శీర్షిక వారంవారం ఒక తెలుగు రచయిత లేదా రచయిత్రి గురించిన స్కెచ్లు ప్రచురిస్తున్నరోజుల్లో తన కసలే తగినంత గుర్తింపు రాలేదనుకునే ఒక కవి మిత్రుడు నండూరి రామ్మోహనరావుగారితో ""వీడెవడండి ప్రతి అడ్డమైనవాడి గురించి రాసి పారేస్తున్నాడు.."అని వేష్ట పడ్డాడు.వెంటనే నండూరివారు "ఇంకా మీ గురించి రాసినట్లు లేదు" అన్నారు చాలా కూల్ గా.

ఒక కోటీశ్వరుడు హాలీవుడ్ నవ్వుల రాజైన చార్లీ చాప్లీను ఒకపార్టీలో కలిశాడు.
"నేను నా జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రారంభించాను"అన్నాడు దర్పంగా కోటీశ్వరుడు.
"అలాగా!నేను నా జీవితాన్ని అసలు జేబే లేకుండా ప్రారంభించాను తెలుసా "అన్నాడు చాప్లిన్.







Saturday, June 1, 2013

అచ్చతెలుగు ప్రేమలేఖ

 


'వేయి పడగలు' నవల చదివిన ముళ్ళపూడి వెంకట రమణ గారు, విశ్వనాథ గారి శైలిలో ఒక ప్రేమలేఖ రాసారు.... అదెప్పుడో చదివిన గుర్తు. అలాగే జగన్నాథ్ గారు ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుందో, చదవండి .

అహో లలనామణి, 

త్వదీయ వదనారవిందము ఉదయార్క భాను బింబము వలె, మదీయ మానసమును ఆనంద డోలికల్లో తెలియాడిన్చుచూ, రంజింప చెయుచున్నది. ఏమి ఆ మేని సౌకుమార్యము , మెత్తని పారిజాత కుసుమ దళాలను తలపింప చెయుచున్నది. ఏమి ఆ సుందర దరహాసము... ఎదుట వన్నెచిన్నెల  హరివిల్లు విరిసినట్టుల ఉన్నది. ఆ నడక లోని హొయలు గజ గమనమును పొలుచున్నది. తమ ముఖకమలము పై కురులు జాలువారుతున్న, కమలము చుట్టూ భ్రమించు భ్రుంగమును చూచినటుల ఉన్నది.  ఆ మృదు పల్లవ పదములకు ఒక మంజీరమునయినా కాకపోయితినే .... నా దుర్భాగ్యమును యేమని చెప్పెద . 
 
http://dailylifedramas.files.wordpress.com/2012/01/5516443-funny-boy-in-love-cartoon-and-vector-character.jpg

ఓ పువ్వుబొణీ , తమ మానస సరోవరమున ఒక హంసనై విహరించవలెనని , నా మానసము ఉవ్విళ్ళూరు చున్నది. నా భవసాగర జీవనయాత్ర అనే, నావకు తామే చుక్కానియై నడిపించమని మనవి చేయుచున్నాను. మదీయ మనః స్థితిని సవివరముగా విన్నవించుకొంటిని . నాథుడిగా అంగీకరించేదరో, అనాధునిగా చేసి త్రుణీకరించేదరో, ఇకపై తమ దయ. సర్వం జగన్నథమ్. 

ఇట్లు  
భవదీయ విధేయుడు, 
మాన్ రోబో సస్పెన్స్ థ్రిల్లర్ రచయత, కవితా రత్న, జగన్నాథ్ .  

ఇది, ఈ తరం అమ్మాయికి ఇస్తే, బదులు ఇలా ఉంటుంది .... డ్యూడ్, నాకు ' మానస సరోవరం, యాత్ర,' తప్ప ఏమి అర్ధం కాలెదు. నువ్వేదో మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి హెల్ప్ చెయ్యమని అడిగినట్టు మాత్రం తెలిసింది . కింద ఏజెంట్ నంబెర్ ఇస్తున్నా... హ్యాపీ జర్నీ . 


గాడిద గుడ్డు కధ

గాడిద గుడ్డు కధ
(పుస్తక సేకరణ )
 
'గాడిద గుడ్డు..' అంటూ ఉంటారు. అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా! మరి ఎందుకలా అంటారు ? చదవండి . 

జోగులుకి చదువు అబ్బలేదు. ఆరుశాస్త్రాలలో ఉద్దండులయిన పండితులు ఉన్న ముంగండ అగ్రహారంలో, ఇరవై ఏళ్ళు వచ్చిన తాను ఒక్కడే, ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది .దూర దేశానికి వెళ్లయినా సరే, పిలక్కి తాడు కట్టుకుని అయినా సరే( నిద్ర మానుకుని కష్టపడటం అనేందుకు ఈ ఉపమానమ్... నిద్ర పొతే, తూలి , పిలక్కి ఉన్న తాడు వెనక్కి లాగడంతో మెలకువ వస్తుంది కదా...) మహా పండితుడయ్యి తిరిగి రావాలని సంకల్పించాడు .

 దూర దేశానికి వెళ్లి, ఒక సత్రంలో బస చేసి, తోటి ప్రయాణికుడిని ' అయ్యా! నన్ను ఆరు మాసాల్లో పండితుడిని చెయ్యగల గురువు కావాలి,' అని అడి గాడు .

 'ఓ లేకేం, నేను విద్య నేర్పిన శిష్యులు అంతా ఇప్పుడు రాజాస్థానాల్లో కొలువు చెస్తున్నారు. మరి, గురుదక్షిణ ఏమి ఇస్తావ్ ?' అని అడిగాడు ఆ గురువు. 

' నా బంగారు మురుగులు ఇస్తాను. గురువర్యా! వెంటనే నాకు విద్య నేర్పండి,' అంటూ సాష్టాంగ పడ్డాడు జొగులు. 

'నీకు శబ్దాలూ, సంధులూ వచ్చునా?'

'వాటిల్తోనే అసలు చిక్కండీ .  సంధులూ- సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా?'

'అసలు వాటితో అవసరం లేకుండా పండితుడిని చెయ్యడమే నా ప్రత్యెకత. శత శ్లోకేన పండితః ' అన్నారు పెద్దలు. అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితుడు అవుతాడని శాస్త్రమ్...
 
 

"గురువుగారు, మరీ వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం . కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా?" దీనంగా అడిగాడు జోగులు . 

" తగ్గకేమి? చతుః  శ్లోకేన పండితః " , అన్నారు శాకటాయనుల వారు. అంటే, నోటికి నాలుగు శ్లోకాలు వచ్చిన వాడు కూడా పండితుడే," 

"అయితే, నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు," అంటూ మురిసిపోయి, విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు . 

నాలుగు నెలల తర్వాత గురువుగారు 'పండితుడివయి పోయావు, ఇక నీకు తిరుగు లేదు పో,' అంటూ సెలవిచ్చారు. వెంటనే జోగులు తన వేలికున్న బంగారు ఉంగరం అమ్మి, కాశ్మీరు శాలువా భుజాల నిండుగా కప్పుకుని, కళ్ళు ఎగరేస్తూ, దర్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు . 

దారిలో అతడికి ఒక చచ్చిన గాడిద కనిపించింది . 'అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ .. ' అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది . వెంటనే ఒక తాడు తీసుకుని, గాడిద మెడకు కట్టి, ఈడ్చుకుని వెల్లసాగాడు . అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడ సాగాడు . 

వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది . "సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్..." అంటే, శరీరం అంతటిలో తలే ముఖ్యమయినది . కనుక, రంపం లాంటి కొమ్మ తీసుకుని, గాడిద తల నరికి దాన్ని తీసుకు పోసాగాడు . కాసేపటికి అది కూడా బరువు అనిపించింది . 

అప్పుడు మూడవ శ్లోకం గుర్తుకు వచ్చింది . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ...' అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమయినవి. వెంటనే, సన్నటి వెదురు బద్దతో గాడిద కన్ను గుడ్డు పెకిలించి, అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు . దారిలో ఒక పలివెల అనే దేశం వచ్చింది . ఆ దేశపు రాజు పండిత ప్రియుడు అని విని, రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు . 

అప్పుడు జోగులుకి నాలుగోవ శ్లోకం గుర్తుకు వచ్చింది . ' రిక్తహస్తేన నో పెయాట్ రాజానం దైవతం గురుమ్... ', రాజును, దైవాన్ని, గురువును, వట్టి చేతులతో దర్శించకూడదు . ఏదో వొకటి ఇవ్వాలి, అనుకుని, రాజు వద్దకు వెళ్లి, తన చేతిలో ఉన్న గాడిద గుడ్డును ఇచ్చాడు . 

ఆ వింత వస్తువును చూసి, బెదిరిన రాజు జోగులుకి బాగా దేహశుద్ధి చెయ్యమని, నౌకర్లకు ఆజ్ఞాపించాడు . తాను ఇంత శ్రమ పడి నేర్చిన పాండిత్యం, గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లుమన్నాడు జోగులు . 

అదండీ సంగతి, గాడిద గుడ్డంటే , గాడిద కన్ను గుడ్డు అన్నమాట .