Saturday, September 28, 2013

ఆదికవి నన్నయ్య -2

'అచ్చంగా తెలుగు' పేస్ బుక్ బృందంలో వివిధ మిత్రులు అందించిన నన్నయ్య గారి విశేషాలు, పద్యాలు...

పరవస్తు నాగసాయి సూరి 

తెలుగు వారి మనసుల్లో చోటు సంపాదించుకున్న ఆదికవి నన్నయ. ఆయన కంటే ముందు ఎందరో కవులు ఉంటే ఉండవచ్చు గాక.... అద్భుతమైన కావ్యాలు రాస్తే రాయవచ్చు గాక.... కానీ పంచమ వేదాన్ని మొదలు పెట్టగల సాహసం చేసిన నన్నయను ఆదికవి అనకుండా ఎలా ఉండగలం. వందేళ్ళ సినిమా గురించి చెప్పేటప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే గురించి చెబుతాం. ఆయన కంటే ముందు సినిమా కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. కానీ తొలి విజయం ఇక్కడ సాధ్యమైంది. ప్రారంభం ఘనంగా ఉండాలని ప్రతి వారూ భావిస్తారు. అందుకే.... నన్నయను ఆదికవిగా తెలుగు సాహిత్య పుటల్లో నిలిపారు. 

సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’ అనీ, రామరాజ భూషణుడు ‘వాగశాసనుడు’ అనీ మాత్రమే నన్నయను స్తుతించారు. ( ద్వానాశాస్త్రిగారి ఓ ఆర్టికల్ నుంచి )

మహానుభావులకు భవిష్యత్ ఏం జరగనుందో తెలుస్తుందట. ఆ విషయంలోనూ నన్నయను ఆదికవిగా ఒప్పుకోవచ్చు. భారతాంధ్రీకరణను ప్రారంభిస్తూ....

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాజ్ఞ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే

అంటూ సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభించారు. 
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. వేద స్వరూపులు. దేవతాపూజ్యులు. పురుషోత్తములు. అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. అని ఈ పద్యం అర్థం. 
ఇక్కడే నన్నయ భవిష్యత్ దర్శనం బోధపడుతుంది అని పండితులు చెబుతారు. ఎందుకంటే.... ఇక్కడ త్రిమూర్తుల గురించి నన్నయ చెప్పారు. అప్పట్లో ఇష్టదేవతను స్మరించుకునే వారే తప్పించి... ఇలాంటి వర్ణన ఓ విధంగా లేదనే చెప్పాలి. నన్నయ ఇలా చెప్పడంలో ఆంతర్యం.... మొత్తం ముగ్గురు ఈ కావ్యాన్ని పూర్తి చేస్తారు అని భవిష్యత్ ను దర్శించడమే అని అంటారు. 

లక్ష్మిదేవిని వక్షాన ధరించిన నారాయణుడి లాంటి నన్నయ... సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ... తిక్కనకు కవి బ్రహ్మ అనే బిరుదము ఉంది. అంటే బ్రహ్మ లాంటి తిక్కన... పార్వతిని తన అర్థభాగమున నిలిపిన పరమేశ్వరుడు... ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. అంటే శివుడి లాంటి ఎర్రన... మహాభారతమును పూర్తి చేసి మనకు శ్రేయస్సును కలిగిస్తారు అని నన్నయ చెప్పకనే చెప్పారు అని విబుధులు అంటారు. 

మహాభారతం అనేది ఓ కథ మాత్రమే అయితే మనకు శ్రేయస్సు ఎలా కలిగిస్తుంది. నన్నయ రాసిన పద్యాల్లోని ఓ రెండు మూడు ఉదాహరణలు చూద్దాం....

మనకు సభామర్యాద ముఖ్యం అని చెబుతారు....
అది ఎలా ఉండాలో... యయాతి రూపంలో నన్నయ తెలియజేశారు....

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

సభలో మనసుకు ప్రియంగా ఉండే హిత వాక్యాలే చెప్పాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి.


సత్యమేవ జయతే అనేది మన భారతీయులు నమ్మే మూల సూత్రం....
దాని గురించి శకుంతల రూపంలో నన్నయ తెలియజేశారు....

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు.

ఒక చోట భవిష్యత్ గురించి చెబుతూ నన్నయ మన వేదాంతాన్ని ఆవిష్కరించారు.

మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.

సంసారం అతి చంచలమైనది. సంపదలు ఎండమావులవంటివి, క్షణికమైనవి. గతకాలమే వచ్చేకాలం కంటే మేలైనది. ఇది మనం తరచుగా వాడే సామెత కూడాను.

ఇలాంటి గొప్ప విషయాలను తెలిపే ఉపాఖ్యానాలు నన్నయ విరచిత భారతంలో ఎన్నో ఉన్నాయి. ఒక్క ఆదిపర్వంలోనే నలభై వరకూ ఉన్న ఈ ఉపాఖ్యానాలు సామాజిక విలువలను ప్రతిబింబిస్తాయి. ఈ విలువలే కదా మనిషికి శ్రేయస్సును కలుగజేసేది. అందుకే నన్నయను ఆదికవి అనడం సముచితంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. 

ఇక చివరిగా... మహాభారతంలో ఆయన రాసిన చివరి పద్యంతో ముగిస్తాను....

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై

మెరిసే తారకహారాలపట్ల శారదరాత్రులు దొంగలుగామారాయి (తెల్లని వెన్నెలలో చుక్కలు బాగా కనపడవు). అప్పుడే వికసించిన తెల్లకలువల సౌరభాలను వంటబట్టించుకొన్న పిల్లగాలులు వీస్తున్నాయి. పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడివలె తెల్లని వెన్నెలను వెదజల్లుతున్నాడు.

--- పరవస్తు నాగసాయి సూరి


రావినూతల శ్రీనివాస్ గారు 


ఆది పర్వంలో పక్షి రూపంలో తొందరగా కైవల్యం పొందవచ్చని గ్రహించి మందపాలుడనే ముని పక్షి రూపు ధరించి జరిత అనే

లావుక పక్షిని పెళ్ళాడి ఆమెద్వార నలుగురు పిల్లలను పొందాడు. తరువాత తపస్సు చేయడానికి వెళ్ళాడు. కృష్ణార్జునుల సహాయంతో అగ్ని దేవుడు కాండవ వనాన్ని దహిస్తున్న సమయంలో, అన్ని వైపుల నుండి అగ్ని దహిస్తుంటే తన పిల్లలను కాపాడుకోవటానికి జరిత పడుతున్న బాదను, ఆమె మాతృహృదయాన్ని నన్నయ వర్ణించిన తీరు అద్భుతం. అందులోని కొన్ని పద్యాలు
చంపకమాల:
ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్:
వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే:
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ:
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:.
అర్థము: ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను.
తేటగీతి
బిలము సొచ్చితిమేని నందెలుక చంపు:
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని:
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ:
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:.
అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము. ఎలుక చేతిలో చచ్చే కన్న అగ్నిలో ఆహుతి కావడం వలన పుణ్యలోకాలనైన పొందెదము.
కందము
జ్వలనంబు వాయువశమునఁ:
జీవనము మాకు దొరకొను గృఛ్రం:
బుల సంశయయుతకార్యం:
బులు గర్తవ్యములు నియతములు వర్జ్యమ్ముల్:.
అర్థము: వాయువు ఎటు వీస్తె అగ్ని అటువైపు వెళ్లును, అదృష్టవశాత్తు గాలి అనుకూలంగో వీస్తే ప్రాణాపాయమునుండి తప్పించుకొన వచ్చును, కాని బిలములోని ఎలుక బారి నుండి తప్పించుకొనుట కష్టము, అందు వలన చెట్టుపైనుండ శ్రేయస్కరము.

యీ విషయము అంతర్జాలము నుండి సేకరించినది.



No comments:

Post a Comment