Saturday, September 28, 2013

ఆదికవి నన్నయ్య - 3

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు నన్నయ్య గారి గురించి అందించిన పద్యాలు, విషయాలు...

శ్రీ డి వి లీలాప్రసాద్ గారు 

నన్నయ్య - ఆంధ్ర కావ్య భాషాస్వరూపము

హరిహరాజ గజా ననార్క షడాస్య మాతృ సరస్వతీ
గిరి సుతాదిక దేవతా తతికిన్ నమస్కృతి సేసి దు
ర్భర తపోవిభవాధికున్ గురుపద్యవిద్యకు నాద్యు నం 
బురుహ గర్భ నిభున్ ప్రచేత సుపుత్త్రు భక్తి ( దలం చుచున్ --- నన్నయ్య.

*** నన్నయ్య గారు తన భారతము మొదట నిద్దరు కవులను మాత్రమే స్తుతించినారు. మొదటి
కవి వాల్మీకి, రెండవ కవి వ్యాసు( డు. మూడవ కవిని నెన్నుకొనలేదు.

*** పద్య విద్య: ఈ విద్య బహు విధములు. ఇందులో ప్రధానమైనది పద్యం. విద్య యనగా
" విద్య ఎంతమేర యుండునో యున్నంతమేర ప్రతిభ యనుస్యూతమై యుండును. ఈ విద్యకు
మొట్ట మొదటిది పద్యము. నన్నయ్య గారు తెలుగు లో పద్యము వ్రాయుటెట్లో, యెట్లు
వ్రాసినచో పద్యమగునో చేసి చూపించినాడు.

*** ఆంధ్ర భాష లో మొట్టమొదటి మహాకావ్య నిర్మాణము, మహా కార్యవగ్రుడైన, మహర్షి
కల్పుడైన నన్నయ్య గారు, యా నిర్ణయము చేసెను. ఉత్పలమాల, చంపకమాల,
శార్దూల మతేభములు, కంద, సీస, గీత పద్యము -- వీనిని సర్వాంధ్ర మహాకావ్య
ప్రధాన శరీరభూతమైన చందస్సులుగా నిర్ణయించెను. వాటికి కావ్యాకృతి నిచ్చెను. 
తరువాత కవులకు మార్గమిదియే. ఇది నన్నయ్య గారి గొప్పదనము.

*** ఆంధ్ర సాహిత్యములో మొట్ట మొదటే నన్నయ్య, సామాన్యములైన, ఉదాత్తములైన
భావములను విడమరచి కావ్యాభిలాషులకు నేర్పించి పెట్టిరి. వారు ఆంధ్ర కావ్యభాషా
స్వరూపమును నిర్ణయించెను.

*** నన్నయ్య తెలుగు లో ఏది వ్రాసినను కావ్య పద్దతిన, నాటక పద్దతిన వ్రాసినాడు.
అల్పాల్పముగా కొన్ని వందలయేండ్లు నడచిన తరువాత గానీ ఒనగూడని నొక భాషా
సారస్వతము, మహా కావ్య రూపమున నొక్కసారిగా తొట్ట తొలుత తానే సంతరిచి పెట్టిన
మహనుభావుడు నన్నయ్య -- ఆంధ్ర శారదకు కొన్ని వందలేండ్లు కలసి వచ్చినట్లు చేసినాడు.

*** సంస్కృత భాష యందు, కావ్యము నందు యెన్ని సౌదర్యములు నెన్ని రామణీ యకములు,
శాబ్దీకములైనవి, యార్దీకములైనవి చేయుటకు వీలున్నదో, వాని నన్నింటిని
తెలుగు కావ్యమునందు చేయుటకు వీలైన భాషనూ -- నన్నయ్య గారు నిర్ణయించిరి.

**** ఇది నన్నయ్య గారు మనకు, మన భాషకు చేసినట్టి మహోపకారము.
**** పద్య విద్య యనగా, నన్నయ్య గారు దీనిని సర్వము యని భావించిరి.
**** అంబురుహగర్భుడాయన యొక్కడే ! విద్యాదయితుడు !!

**** ఇది నన్నయ్య గారి మీద, శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారి సహేతుక అభిప్రాయము.

                                                         



కొల్లూరు విజయ శర్మ 20.9.13 

ఋషి వంటి నన్నయ్య "అన్నారు మహాకవి విశ్వనాధ. ఇక ఆయన కవిత్వమా...తేనె వాగు... కృష్ణశాస్త్రి గారు చెప్తారు.. "స్వర్గమా!మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసికెళ్ళనా"అంటార్ట తిక్కన గారు.. స్వర్గమా... భూమి మీదికే అవతరింప చేస్తాను అంటారట నన్నయ గారు. అన్నట్లే అవతరింప చేశారూ.ంమనల్ని తరింప చేశారు కూడా . 

"శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షావుముఖామ్జేషుయే 
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవామ్ 
తేవేదత్రయమూర్తాయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై 
ర్భూయాసుఃం పురుశోత్తమామ్బుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే "
ఇది నన్నయ మహాభారత మంగళా చరణ శ్లోకం.
లక్ష్మీ దేవిని హృదయంసరస్వతి ని ముఖం లో ,పార్వతిని శరీర సగభాగం లో విష్ణు ,బ్రహ్మ,పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు చిరకాలము ఉందు గాక... అని భావం.
ఇక్కడే ఉంది నన్నయ గారి రుషిత్వం.లోకంలో మన బోటి వారు మాట్లాడే మాటల్లో అర్ధాన్ని శబ్దం వెతుక్కుని వస్తుంది. అంటే ఏం చెప్పదలిచామో ఆ భావానికి తగిన పదాలను ఏరుకుంటాం .కానీ తపశ్శక్తి సంపన్నులయిన మహర్షులకి అర్ధమే వాక్కుని వెతుక్కుంటూ వెళ్తుందట. అంటే వారు ఏది అంటే అదే జరుగుతుంది. వారు మంచి పలికారా అది వరం. చెడు తలిచారా అదే శాపం. ఒక్కసారి పై శ్లోకం చూశారు కదా.. నన్నయ్య గారు త్రిమూర్తులని స్మరించారు. కానీ వరుస మారింది. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం ఆయన చూడండి. ముందుగా విష్ణువు,తర్వాత బ్రహ్మ ,ఆ తర్వాత శివుడు ఇలా స్మరించారు.
నిజానికి నన్నయ్య గారు మహాభారత రచన కి శ్రీకారం చుట్టే వేళ అది తన ఒక్కరి తో పూర్తి కాదు అని కలలో కూడా ఊహించలేదు. ,వ్యాకరణ రాసి.. లో కల్పించి ఆయన భారత రచన కి పూనుకున్నారు. విష్ణువు స్థితికారకుడు నన్నయగారు కూడా ఆ ఆ స్థితినే తెలుగు భాషకి ఇచ్చారు. ఆయనకీ ప్రజలు వాగనుశాసనుడు ,శబ్దానుశాసనుడు ఇచ్చారు. విష్ణువుతర్వాత బ్రహ్మ గారు.. నన్నయ్యగారి తర్వాత 200 ఏళ్ళ తర్వాత వచ్చారు. అలవోకగా పదిహేను పర్వాలను తెలుగు చేసిన ఆయన వాక్కులో సరస్వతి తాండవిస్తుంది అనడం లో సందేహమే లేదు. మరి ప్రజలు ఆయనకీ ఇచ్చిన బిరుదు?"కవి బ్రహ్మ "... ఆ తర్వాత మరో శతాబ్దానికి వచ్చిన ఎఱ్ఱన గారు.. నన్నయ గారు రాయగా ఖిలమైపోయిన అరణ్య పర్వం సగభాగాన్ని రాశారు .ప్రజలు ఆయనకీ ఇచ్చిన బిరుదు "ప్రబంధ పరమేశ్వరుడు"నన్నయ్య గారు శ్లోకం రాసేటప్పుడు కలలో కూడా అనుకుని ఉండరు. కానీ ఆయన వాక్శుద్ధి ఇలా జరిపించింది. Vijaya

నన్నయ మహాకవి పద్యాలలో అత్యద్భుతమైన,పరమ హృద్యమైన పద్యాలలో ఇది ఒకటి. 
విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాధ! పుత్ర గా 
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం 
ద్రపరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ బుత్రగా 
త్ర పరిష్వంగ మునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే !
శకుంతల ఎవరో తనకు తెలియదన్న దుష్యంతునితో శకుంతల ఈ మాట అంటుంది "ఇన్ని వాద ప్రతివాదాలు ఎందుకు మహారాజా!ఒక్క సారి నీ కుమారుణ్ని కౌగిలించుకో . ముత్యాల కానీ ,కర్పూరపు పరిమళం కానీ ,పూల పుప్పొడి కానీ ,గంధం కానీ చివరికి వెన్నెలకానీ కుమారుడిని కౌగిలించుకున్నప్పుడు కలిగే చల్లదనానికి ,పులకరింతకీ సాటిరావు.. అంతకంటే ఇవేమీ హృఊద్యమైనవి కావు "అని. 

మనలో చాలా మందికి ,ఈ భావన అబుభవేకవేద్యమే అనుకుంటాను.

 రావినూతల శ్రీనివాస్ గారు 

హరివిచిత్రహేమ కవచావృతు డున్నతచాపచారు దీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సెంద్రచాప శం
సారుచి మేఘమో యనగ బాండవ మధ్యముడొప్పి బద్ధ తూ
ణీరుడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నె చూడగన్. 6-17

అందమైన విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు. ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్లకలువల రంగులో తలతళలాడుతున్నాడు. పైరెండింటితో (విచిత్రహేమ కవచం, ఉన్నత చాపం) కలిసిన మొత్తం రూపం – హరివిల్లుతో, మెరపుతీగతో కలిసి ఉన్న నీలమేఘంలా ఉంది. వీపు మీద అటూ ఇటూ అంబులపొదులున్నాయి. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇలా వచ్చి రంగమధ్యమంలో నిలబడితే ప్రజల చూపులన్నీ అతడి మీదే నిలబడ్డాయి.

అర్జునుడి రూపంలో ఉన్న ఉదాత్తతనీ, వీరోచిత దర్పాన్నీ, ఉన్నతినీ ఈ పద్యం సూచిస్తోంది. సమాస నిర్మాణంలో ప్రయోజనం నెరవేరింది. నడకలో ఠీవి స్ఫురిస్తోంది. వేటిని స్పురింప చెయ్యాలన్నా కవి చేతిలో ఉన్న సాధనాలు శబ్దార్థాలు మాత్రమే కదా! వాటిని సద్వినియోగం చేసుకొని వాచ్యార్థం కన్నా లోతైన అంశాలు స్పురింపజేయగలిగిన వాడే మహాకవి.

అర్జునుడు నల్లగా ఉంటాడని ఈ పద్యంలో తెలుస్తోంది. “కఱ్ఱి విక్రమంబు కాల్పనే” అని ద్రౌపది ఉద్యోగపర్వంలో అంటుంది. కఱ్ఱి అంటే నల్లనివాడు అని అర్ధం. ద్రౌపది కూడా నలుపే. ‘కృష్ణ ‘ అని ఆవిడకి పర్యాయపదం. శ్రీకృష్ణుడు సరేసరి నీలమేఘశ్యాముడు. ఇలా పాండవ పక్షంలో ముఖ్యులు ముగ్గురు నల్లనివారు.

ఇంద్రధనుస్సుతో మెరుపుతీగతో కలిసిఉన్న మేఘంలా ఉన్నాడు అర్జునుడు. వర్షఋతువులో కనపడవచ్చు ఇటువంటి దృశ్యం. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఇంద్రచాపంతో కలిసిఉన్న మేఘంగా ఉత్ప్రేక్షించడం వల్ల అర్జునుడు ఇంద్రుని కుమారుడు అనే విషయం కూడా స్ఫురణకు వస్తుంది.

ఈ పద్యం నన్నయ భారతం లోది,అంతర్జాలం నుండి సేకరించినది.


20. 9. 13 

 నన్నయభట్టారకుడు ఆంధ్ర మహా భారతాన్ని ఈ దిగువ సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. ఇది త్రిమూర్తులను స్తుతిస్తూ చేసిన మంగళస్వరం. 
శ్రీవాణి గిరిజాశ్చిరాయదధతో వక్షోముఖాం గేషుయే 
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీ పుంస యోగోద్భవాం 
తే వేదత్రయ మూర్తయే స్త్రీ పురుష సంపూజితా వస్సురై 
ర్భుయాసుః పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరాశ్రేయసే!

సరస్వతి, పార్వతి, లక్ష్మి లను ఎవరు అనాదిగా ముఖమునందు, దేహమందు , హృదయమందు ధరించి సృష్టి, స్థితి, లయ కార్యములను, లోకములను నిర్వహిస్తున్నారో, మూడు వేదాలను ఆకారముగా ధరించినవారు, దేవతలచే పూజింపబడువారు ఐన బ్రహ్మ,శివుడు, విష్ణువు అను ముగ్గురు దేవతలు మీకు శ్రేయస్సును కల్గింతురుగాక.



శ్రీదేవి సిరి కావుటూరు 

ఆదికవి నన్నయ వ్యాసభారతాన్ని కీర్తిస్తూ చెప్పిన సందర్భంలోని పద్యం...

ధర్మతత్త్వఙ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహమని, యైతిహాసికు లితిహాసమనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహికొనియాడుచుండ

వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు డాదిముని పరాశరాత్మజుండు
విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండఁ జేసె భారతంబు.

భావం: ధర్మతత్త్వఙ్ఞులు ధర్మశాస్త్రగ్రంధమనిన్నీ, వేదాంతులు వేదాంత శాస్త్రమనిన్నీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనిన్నీ, కవిశ్రేష్ఠులు గొప్పకావ్యమనిన్నీ, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమనిన్నీ, భూమియందు పొగడుతూ ఉండగా, సర్వవేదాల సత్యస్వరూపాన్ని యెరిగినవాడున్నూ, వేదాలను విభజించి వేదవ్యాసుడని పేరుపొందిన వాడున్నూ, ఆదిమునియున్నూ, విష్ణువుతో సమానుడున్నూ అయిన పరాశరముని కుమారుడు ( కృష్ణద్వైపాయనుడు ) సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంధాన్ని రచించాడు.


భారతి కాట్రగడ్డ 

మహొజ్జ్వల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్య ప్రపంచంలో మొట్టమొదటి తెలుగు గ్రంధం మహాభారతం. దీన్ని ఆంధ్రీకరించిన నన్నయ ఆదికవి. క్రీ.శ. 1022-1063 మధ్యకాలంలో రాజమహేంధ్రవరం రాజధానిగా పాలించిన చాళూక్య మహారాజు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ మహాభారత రచన ప్రారంభించాడు. 'తింటే గారెలు తినాలి,వింటే భారతం వినాలీ అన్నంత సర్వాంత సుందరంగా కవిత్రయం ఈ గ్రంధాన్ని తీర్చిదిద్దారు. ఐతే నన్నయ ఈ గ్రంధం అన్నిరంగాలవారికి అన్నిరకాలుగా కనిపిస్తుందని ఈ పద్యరత్నం ద్వారా తెలియజేసారు.

ధర్మశాస్త్రఙ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని
కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాస మనియు
పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
యం బని మహి కొనియాడుచుండ

తే. వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు .         ---  నన్నయ.


No comments:

Post a Comment