Thursday, September 12, 2013

జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి

తెలుగు పారడీ ప్రక్రియకు ఆద్యుడు 'జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి.'

ఆయన మీద ఈ పద్యం అంతర్జాలంలో దొరికింది....

ఎప్పుడూ ఎవర్రెడీగా ఒక పారడీతో ఉండేవా
డొకడుండేవాడు; కవన్నవాడినెవ్వడినీ కవ్విం
చక నవ్వించక వదిలేవాడు కాడంటే కాడు; పే
రుకతడు జరుక్శాస్త్రి, పారడీ కళకు తాపీలేని మేస్త్రీ!

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి లేదా జరుక్‌శాస్త్రి ప్రత్యక్షరం చమత్కారానికి విలాసం. కానీ ‘సాహిత్యం కోసం అంతగా ప్రాణం పెట్టిన మనిషి ఇంకొకరు లే’రం టారు సమకాలికులు. ‘జలసూత్రం’ ఇంటి పేరేమిటి? అంటే నీటిసూత్రం- హెచ్‌టువో- కనిపెట్టింది మా వాళ్లే అని చమత్కరించేవారాయన. ఆయన వెక్కిరించని తెలుగు సాహితీ దిగ్గజం లేదు. విశ్వనాథ, దేవులపల్లి, శ్రీశ్రీలతో సహా ఆయన ‘కణకణ మండే’ పేరడీల పోటు తప్పిం చుకున్న ధన్యులు తక్కువే. విశ్వనాథ వారిని ‘పాషాణ పాక ప్రభు’ అని ముద్దుగా ఎద్దేవా చేసిన ఉద్దండుడు. భావకవులనీ, అభ్యుదయ కవులనీ కూడా వెక్కిరించి, నవ్వించారు. అయినా ఆయన సర్వసాహితీ జనబంధువే. ‘రుక్కయ్యా! వాణికి లిప్‌స్టిక్కయ్యా!’ అని ముచ్చటపడ్డాడు శ్రీశ్రీ. కొంచమే అయినప్పటికీ ‘శరత్ పూర్ణిమ’ ‘ఒక్ఖ దణ్ణం’ వంటి గొప్ప కథలూ, చుర్రుమనే పద్యాలు కూడా పలికినా జరుక్ చెప్పిన పేరడీలే ఖ్యాతి గాంచాయి. 

శ్రీశ్రీ ‘అద్వైతాన్ని’ జరూక్ శాస్త్రి ‘విశిష్టాద్వైతం’గా ఎలా మలిచారో చూడండి.
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచుల చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం (శ్రీశ్రీ మహాప్రస్థానం)

ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం. (జరుక్ శాస్త్రి పేరడీ)

ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు. జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకు చెప్పిన పేరడీలు గమనించండి –
నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను...
నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను....

(ఈ ఫోటో అందించిన బ్నిం మూర్తి గారికి ధన్యవాదాలు)


జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు ఒక రోజు కరుణశ్రీ గారింటికొచ్చారట. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో మనుషులందరూ చప్పుడు చెయ్యకుండా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కరుణశ్రీ గారేమొ గంభీరంగా కూర్చుని ఉన్నారు. జరుక్శాస్త్రిని చూడగానే "రండి! కూర్చోండి" అని ఆహ్వానించారు. జరుక్శాస్త్రిగారేదో చెప్పబోతే "ఉష్!" అని కరుణశ్రీగారు వారించారు. శబ్దం చెయ్యకండి అని సూచించారు. జరుక్శాస్త్రిగారు సాధ్యమైనంత తగ్గుస్వరంతో "ఏం జరిగిందీ?" అని కరుణశ్రీ చెవి దగ్గరకు వెళ్ళి అడిగారు. అప్పుడు కరుణశ్రీ గంభీరంగా "కిడ్నేప్" అన్నారు. "ఆ! ఎవరిని? ఎప్పుడు?" అని ఆదుర్దాగా అడుగుతుంటే కరుణశ్రీ గారు నవ్వుతూ... కిడ్నేప్ అంటే ఎవర్నో ఎత్తుకుపోవడం కాదు. కిడ్ అంటే పిల్లవాడు.నేప్ అంటే కునుకు తీసుకుంటున్నాడు అని అర్థం. నువ్వు పేరడీకింగ్ వు కదా..ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? అన్నార్ట కరుణశ్రీ. ఈ విషయం జరుక్శాస్త్రి ఆయన మిత్రులందరికీ చెప్పి నవ్విస్తుండేవాడట.


No comments:

Post a Comment