Monday, September 2, 2013

విశ్వనాధ సత్యనారాయణ

"విశ్వనాథ కవిత మెరుపునకు శిఖరాయమానము శ్రీమద్రామాయణ కల్పవృక్షము ' అన్నారు తిరుపతి వెంకట కవులలో ఒకరయిన దివాకర్ల వెంకటావధాని గారు . ఈ పద్య కావ్యానికి 'జ్ఞాన పీఠ ' పురస్కారం లభించింది . 

మళ్ళీ రామాయణమే రాస్తారా ? ఎందుకు ? అని అడిగేవాళ్ళకోసం  విశ్వనాధ ముందుగానే ఇలా చెప్పారు ... 

మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి గాన

ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు. 

రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది . ఉదాహరణకు 

అయినవారికేమొ ఆకులయందును,
కానివారికేమొ కంచములను
ఇంటిలోన దినుచు నింటి వాసంబుల
లెక్కపెట్టునట్టి లెక్కగాక


                                                      

సాధనతో కామాన్ని జయించి, భాగవదనుగ్రహాన్ని పొందిన విశిష్ట స్త్రీ అహల్య.  అహల్యా శాప విమోచన ఘట్టాన్ని కూడా, ఈ కావ్యంలో విలక్షణంగా వర్ణించారు విశ్వనాధ వారు. శిలగా పడున్న అహల్యలో క్రమంగా వచ్చిన పాంచభౌతిక స్వరూపమయిన మార్పు, ఈ పద్యంలో సూచించబడింది.

"ప్రభు మేనిపై  గాలిపై వచ్చినంతనే 
  పాషాణ మొకటికి స్పర్శ వచ్చె 
 ప్రభు కాలి సవ్వడి ప్రాంతమై నంతనే 
  శిల కొక్కదానికి  జెవులు గలిగే 
 ప్రభు మేని నెత్తావి పరిమలించినతో న 
 యశ్శంబు ఘ్రాణేం ద్రియంబు జెందె 
 ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు 
గనవచ్చి రాతికి గనులు గలిగె 
 ఆ ప్రభుండు వచ్చి యాతిధ్యమును స్వీక 
రించినంత నుపలహృదయ వీధి 
నుపనిషద్విదితాన మొలికి శ్రీరామ భ 
ద్రాభి రామమూర్తి యగుచుదో చె "


విశ్వనాథ సాంప్రదాయకవి. రాముడు, కృష్ణుడు అతని మనసుకు పట్టే దేవతలు. దాంతో అతని రచనలలో ఆ ప్రొఢ గాంభీర్యం చోటు చేసుకుంది. భాషలో ప్రచీన కవుల పరిమళానికి, విశ్వనాథ స్వెయ్య ప్రతిభా సౌరభం తోడయింది. కానీ, ఆ పరిమళ సౌరభాలను అనుభవించేవారు లేరు. వాటిలోని సౌందర్యాన్ని గ్రహించి మెచ్చేవారులేరు. దాంతో వీలు చిక్కినప్పుడల్లా విశ్వనాథ తన కవిత్వంలో రత్నాలున్నాయని, వాటిని పరిశీలించి, అనుభవించే నాథుడు లేడని వాపోతూండేవాడు. తన రచనలలోని లోతయిన భావాలు, తాను చేసిన ప్రయోగాలు, పొందుపరచిన చమత్కారాలను తానే వివరిస్తూ బాధపడేవాడు.
ఇది నిజంగా దయనీయమైన పరిస్థితి. కవికి తన రచనను అనుభవించి, ఆస్వాదించే శ్రోత లభించక పోవటాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. దానిలోని సొంపులను, సౌందర్యాలను గ్రహించి, పాఠకులకు వివరించే విమర్షకుదు లేకపోవటం మరింత దౌర్భాగ్యం. ఇందుకు చింతించిన విశ్వనాధ 'కల్పవృక్ష రహస్యములు' పేరుతో తన కావ్యానికి తానె భాష్యం రాసారు. ఆ  మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆయన వేదన ఆయన పద్యంలోనే ... 
నా కవిత్వంబునందు రత్నములు కలవు
వాని బెకిలించి చూపెడువాడు లేడు
కాల మిట్లున్నదని మొనగాడువోలె
బలుకు కవిగాడ! యేటికీ స్వాతిశయము?



No comments:

Post a Comment