Sunday, September 8, 2013

పద్యం - హృద్యం

'పద్యం తెలుగువారి ఆస్తి ' తెలుగు పద్యం సంపాదించినంత సౌందర్యం మరెక్కడా పద్యం సంపాదించలేదనేది మాత్రం యదార్థం.తెలుగు పద్యానికి దాదాపు 15౦౦ ఏళ్ళ చరిత్ర ఉంది.  ఛందో బద్ధమైన పద్యం తెలుగు భాషా సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం. అందమైన పద్య రచన ఒక కళాత్మక సృష్టి.   మన పూర్వ సాహిత్యం దాదాపు డెబ్భై శాతం పద్య రూపంలోనే ఉంది. చదువు సంధ్యలు రాని పామరులు సైతం పద్యాలు పాడుతూ భాషను నిలుపుకుంటూ వచ్చారు. 

'శ్రీవాణి గిరిజాశ్చిరాయ' అని నన్నయ వ్రాసిన మొదటి పద్యమే తెలుగులో మొదటి పద్యంగా అందరూ ఆమోదించారు. శృంగారం, హాస్యం, కరుణ ఇలా నవ రసాలను పలికించిన పద్యపఠనం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, ఆస్త్మారాదని, శబ్దోచ్చారణ వలన శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుందని, ధారణా శక్తి పెరుగుతుందని, అధిక పదజాలం అలవడుతుందని పరిశీలకులు చెప్తున్నారు. పద్యానికొక్క బంగారు నాణెమును పొందిన (పిరదౌసి) పద్యము, గణితము మొదలు నాట్యశాస్త్రము మున్నగు ఎన్నో శాస్త్రాలను, ఆచారాలు, ధర్మాలు, నీతి మున్నగు గుణాలను స్వభావాలను తెలిపే పద్యము గురించి

''వ్రాయ క్లిష్టమైనది పద్యం
వ్రాయ తేలికైనది గద్యం
తేలికగా గుర్తించుకో దగ్గది పద్యం
తేలికగా గుర్తించుకో లేనిది గద్యం' అని ఆన్నారు.

చిన్నప్పుడు నేర్చుకున్న కొన్ని మంచి పద్యాలు...

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సందిట తాయోతులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు

నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.



_________________________________________________________________________________
మన 'అచ్చంగా తెలుగు' పేస్ బుక్ బృందంలో మీరు పోస్ట్ చేసిన  కొన్ని మంచి పద్యాలు...

పోతన భాగవతంలోని 'గజేంద్ర మోక్షం ' నుండీ శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారికి ఇష్టమైన పద్యం...

ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


భావం :ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, (ఎవ్వనియందు డిందు)ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను.

శ్రీదేవి సిరికి నచ్చిన పద్యాలు...
కరుణశ్రీ గారి కుంతీకుమారి కావ్యము నుండి.....నాకు చాలా నచ్చిన అద్భుతమైన పద్యం 

పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్ 
నెట్టుచునుంటి తండ్రి! యిక నీకును నాకు ఋణంబుదీరె, మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా 
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే!
(కర్ణుని నదిలోనికి వదిలివేస్తూ కుంతి పడిన వేదన)

నా అభిమాన రచయిత జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి మరొక అద్భుతమైన పద్యం..

గిలగిలమందువే యొరులు గిచ్చిన; కాలికి ముల్లు గ్రుచ్చినన్ 
విలవిల కొట్టుకొందువటె; నీవలె జీవులు కావె! హింసకున్ 
ఫలితము బాధయేగద! ప్రపంచములోని సమస్త జీవులం 
దలరెడు ప్రాణ మొక్కటెగదా! తగునయ్య వృథా వ్యధా క్రుధల్!! 

(గౌతమ కుమారునకు దేవదత్తునకు హంస విషయంలో జరిగిన వివాదము)

శ్రీ భండారు శ్రీనివాసరావు గారికి ఇష్టమైన పద్యం...

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ. 


తాత్పర్యము : ఓ మంచి బుధ్ధిగలవాడా! శ్రీరామచంద్రుని కృపచేత, సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిధ్ధమైన ధారాళమైన నీతులను, వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను.

రాజశ్రీ కి ఇష్టమైన పద్యం...

తన కోపమె తన శతృవు 
తన శాంతమె తనకు రక్ష,దయా చుట్టంబు 
తన సంతోషంమె స్వర్గము
తన దుఖమె నరకమండ్రు,
తథ్యము సుమతీ.
భావం: తన కోపమే మనిషి ని శత్రువు ల బాధిస్తుంది. ఓపిక చుట్టం లా రక్ష గ ఉంటుంది. సంతోషం స్వర్గం లా ఆనందని ఇస్తే దుఖం నరకంలా బాధిస్తుంది.

సంధ్యా రాణికి ఇష్టమైన సమస్యా పూరణ పద్యం.

రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వు పాలైరకటా
సంజయ విధినేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

జగన్నాథ్ గారికి ఇష్టమైన శ్రీనాధుని చాటువు ...

సిరి గలవానికి చెల్లున్
తరుణుల్ పదియారువేలమంది పెండ్లియాడగన్
తిరిపెమునకిద్దారాండ్రా
పరమేశ గంగ విడుం పార్వతి చాలున్

నృసింహపురాణం నుంచీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు సేకరించిన పద్యం...

బడబానలాహతి జడనిధిలో నున్న
పటుశైలతతి ప్రేలి పెటిలె నొక్కొ
ఘనతరోత్పాతనిర్ఘాతసహస్త్రంబు
గడఁగి యొక్కట మ్రోసి పడియె నొక్కొ
పెక్కు జీవులులోన బిక్కట్టువడఁగ నా
బ్రహ్మాండభాండంబు పగిలె నొక్కొ
తఱి గాకయున్న నుద్ధతిఁ బేర్చి రుద్రుండు
విలయోగ్ర పటలంబు వ్రేసెనొక్కొ

తనఁగ నాకాశసకలదేశావకాశ
భరితమై విశ్వమును మూర్ఛపాలుపడఁగ
మొనసిపెఢిలు పెఢిల్లను మ్రోఁత వెడలఁ
బగిలెఁ గంబంబు భువనకంపంబు గదుర

హిరణ్యకశిపుడు ఈ స్థంభంలో హరిని చూపించమని స్థంభాన్ని చరిచాడు. అప్పుడు జరిగిన సంఘటనలలు కళ్ళకు కట్టినట్లు వివరించే పద్యం. 
(ఎఱ్ఱాప్రగడ విరచిత "నృసింహపురాణము" పంచమాశ్వాసము నుండి.)

శ్రీ నాగార్జున కావూరి గారు అందించిన పద్యం...

 ఇచ్చునదె విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులన్
మెచ్చునదే నేర్పు, వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము, వసుధను సుమతీ!


శ్రీ చెరుకు రామమోహనరావు గారు అందించిన చాటువు...

సంస్కృత చాటువు (మేకపోతు గాంభీర్యం )


“అహమేకశత వ్యాఘ్రాన్/ పంచ వింశతి కుంజరాన్ 
ఏక సిహం నభక్ష్యామి/ గడ్డం వపనముత్యతే”

ఈ సంస్కృత చాటువు మనందరికి తెలిసిన “మేక పోతు గాంభీర్యం” అనే తెలుగు సామెతకు సంబంధించిన కథ. ఈ కథ తెలుగువారి ఇంటింటి సరస్వతి ఐన “పెద్దబాలశిక్ష” లో ఉంది. లోపల బెరుకు,బైట కరుకు,కలిగి డాంబికంగా మాట్లాడేవారి విషయంలో ఈ సామెతని ఉపయోగిస్తారు. “వాడు చూడండి ఎలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో” అని. 
ఇదీ కథ : 
ఒక కొండ పరిసరాలలో మేస్తున్న తెలుగు మేకల మందలోంచి ఒక మేకపోతు వేరుపడిపోతుంది. తెలుగు మేక అని ఎందుకన్నానంటే ఆ శ్లోకంలో గడ్డమనే తెలుగు పదం ఉండుటవల్ల. అదే సమయంలో వాన వస్తుంది. వాన నుంచి తప్పించుకోవాలని అది ఒక సింహంగుహలోకి వెళ్తుంది. వెళ్ళిన తరువాత తెలిసింది అది సింహపు గుహ అని. బహుశా జంతు కళేబరాలను చూసి వుహించికోనుంటుంది . అదృష్టవశాత్తు అప్పుడు సింహం గుహలో లేదు. కొంత సమయం గడిచాక సింహం గుహలోనికి వచ్చింది. లోపల వేరే జంతువు వున్నట్లు తెలుసుకొని ప్రాణభయం తో గుహ బైటే నిలిచింది . లోపల ఉన్న మేకపోతు సింహాన్ని చూసి భయాన్ని దిగమ్రింగి గడ్డం మాత్రం సింహానికి కనబడేటట్టు గుహ బైటికి పెట్టి ద్వారమ వద్ద నున్న సింహంతో పై శ్లోకం చెప్పింది. దాని అర్థం ఈ క్రిది విధంగా వుంది :(తాత్పర్యం వ్రాస్తున్నాను)
నేను ఇప్పటికి ఒక నూరు పెద్ద పులులను ఇరవైఐదు ఏనుగులను తిన్నాను ఇంకా ఒక సింహాన్ని తిని గాని ఈ గడ్డం గీయించుకోనని ప్రతిన బూనినాను. సమయానికి నీవు వచ్చినావు అని అన్నది. 
ఆ మాటలు విన్న సింహంఅయ్యా బాబోయ్ అని భయపడి తోక ముడుచుకొని పారి పోయింది . “బ్రతుకుజీవుడా” అనుకొని మేకపోతు కూడా అక్కడి నుంచి పారిపోయింది . ఇది విషయం .

శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి వినాయకుడి పద్యాల సేకరణ...


అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!            --- అల్లసాని పెద్దన.


గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!                  ----- దశ కుమార చరిత్ర లోనిది.

పరవస్తు నాగసాయి సూరి కి ఇష్టమైన పద్యం...

“నను భవదీయ దాసుని , మనంబున నెయ్యపు గిన్క, బూని దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు,మ త్కనుకులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచునంచు నే, ననియెద ,నల్క మానవు కదా, ఇకనైన నరాళ కుంతలా !!

భావం : నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణంలోనిదీ పద్యం. తనకు పారిజాత పుష్పం ఇవ్వలేదని అలిగిన సత్యభామను ఊరడించబోయి తలను తన్నించుకున్న కృష్ణుడు పాడిన పద్యం. కృష్ణుడి లాంటి వాడు ఓ స్త్రీ కాళ్ళ దగ్గర ఎంత సేపు ఉంటాడు చెప్పండి. నను భవదీయ దాసుని దగ్గర మొదలు పెట్టి అరాళ కుంతలా అంటూ జుట్టు దాకా వెళ్ళాడు. అరాళ కుంతలా అంటే నల్లని కురులు గలదానా అని అర్థం. అంటే అందే కాళ్ళ దగ్గర మొదలు పెట్టి... జుట్టును అందబుచ్చుకోవడం బహుశా కృష్ణుడికే సాధ్యమేమో. అదే ఈ పద్యంలో కనిపిస్తుంది.

నిశి అందించిన పద్యం...

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్నతలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!  

భావం - నీకు ఉన్నా, లేకున్నా సరే ఆ విషయం బయటికి తెలియనియ్యకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.


కృష్ణశర్మ గారు అందించిన పద్యం...

కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి 
గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులోనున్న 
జగముల న్రేగున జగతి కదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున 
పైనున్న పచ్చని పటము జార 
సమ్మతి నాలావు నగుబాటు సేయక 
మన్నింపుమని క్రీడి మరల దిగువ 

కరికి లంఘించు సిహంబు కరణి మెరసి 
నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.                                                        ...పోతన భాగవతము

లీలాప్రసాద్ గారికి ఇష్టమైన పద్యం...

అరి జూచున్ హరి జూచు చూచుకములం దందంద మందార కే
సర మాలా మకరంద బిందు సలిల స్యందంబు లందంబులై
తొరగన్ బయ్యెద కొం గొకింత తోలగన్ దోడ్తో శరా సారమున్
దరహా సామృత పోరమున్ గురియుచున్ దన్వంగి హేలాగతిన్ ...
నరకాసునితో యుద్దం చేసే సత్య భామ మీది పద్యం                                             -- శ్రీ నాచన సోమ నాధుడు

అక్క విజయ అందించిన పద్యం...

శ్రవణసుఖంబుగా సామగానంబులు ,చదివెడు శుకముల చదువు దగిలి 
కదలకవినుచుండు కారులను గరికర,శీతలచ్చాయన్ దచ్చీకరాంబు 
కణముల చల్లనిగాడ్పాసపడి వాని న్ ,జెంది సుఖంబున్న సింహములును 
భూసురప్రవరులు భూతబలుల్ దెచ్చి ,పెట్టునీవారాన్న పిండతతులు 
గడగి భక్షింప నొక్కట గలసి యాడు ,చున్న ఎలుకలు బిల్లులు నొండు సహజ 
వైరివర్గంబులయు సహవాసమపుడు సూచి మునిశక్తికెంతయు చోద్యమంది 

నన్నయ గారు కణ్వ మహర్షి ఆశ్రంమాన్ని వర్ణించిన రమణీయ పద్యం. 

మురుకొండ గోపాలకృష్ణ గారు అందించిన చాటువు...

నల్లి బాధ పడలేక కొందరు దేవతలు ఏం చేసారో గుర్తు చేసే ఈ చాటువు అంటే నాకెంతో ఇష్టం.

శివుడద్రిని శయనించుట 
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళమును శేషునిపై 
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ




_____________________________________________________________________________________________


భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
                                                              -చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.

తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
                                                       -శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.

తెలుగు పద్యాన్ని పాతిపెట్టాలని 1950వ దశకంలో ఒక ప్రయత్నం మొదలైంది. ఐతే పాతిపెట్టిన ప్రతి పద్యం ఒక మామిడి చెట్టుగా మొలిచి సువర్ణరేఖలను పండించింది. పద్యాలు ఇప్పుడు అంతరిచిపోయాయని, అనే వారికై చెప్పిన ఈ పద్యం చూడండి. పద్యాన్ని మన హృదయాల్లో ఎప్పుడో పాతిపెట్టారట.

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?
పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?
పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !
పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !
ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?    --- కడిమెళ్ళ వర ప్రసాద్ .

పద్యం మీద మరో పద్యం చూడండి ...
పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్. -- వద్దిపర్తి పద్మాకర్ .

నా చిన్నతనంలో ప్రతి ఇంట్లోనూ పిల్లలకు సుమతీ శతకం, వేమన శతకం, రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం, దాశరథీ శతకం, కృష్ణ, భాస్కర శతకాలు నేర్పించే వారు. కాని ఇవ్వాళ అలాంటి సంప్రదాయం దాదాపు అంతరించిపోయింది. మన ఆస్తి పాస్తులను ఎలా పదిలంగా కాపాడుకుంటామో అలాగే మన పిల్లలకు కనీసం కొన్ని పద్యాలైనా నేర్పి , వారికి పద్యసంపదను వారసత్వంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

పదము చెవిసోక సామవేద గానమగును
పదము చవిచూడ ద్రాక్షారస పాకమగును
ఎదలు కలుగ తనియగ సుధాఝరులు
కురిపించు తెలుగు పద్యమ్ము హృద్యమ్ము సుమ్మా.

పద్యము తెలుగుల విద్యగు! 
హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! 
పద్యము కవితల కాద్యము! 
సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!


5 comments:

  1. శ్రవణసుఖంబుగా సామగానంబులు ,చదివెడు శుకముల చదువు దగిలి
    కదలకవినుచుండు కారులను గరికర,శీతలచ్చాయన్ దచ్చీకరాంబు
    కణముల చల్లనిగాడ్పాసపడి వాని న్ ,జెంది సుఖంబున్న సింహములును
    భూసురప్రవరులు భూతబలుల్ దెచ్చి ,పెట్టునీవారాన్న పిండతతులు
    గడగి భక్షింప నొక్కట గలసి యాడు ,చున్న ఎలుకలు బిల్లులు నొండు సహజ
    వైరివర్గంబులయు సహవాసమపుడు సూచి మునిశక్తికెంతయు చోద్యమంది

    నన్నయ గారు కణ్వ మహర్షి ఆశ్రంమాన్ని వర్ణించిన రమణీయ పద్యం.

    --

    ReplyDelete
  2. భరత ఖండమ్ము చక్కని పాడియావు పద్యం చిలకమర్తివారిది కాదు.

    ReplyDelete
  3. ఈ పద్యం చిలకమర్తి వారిదనే అనుకుంటున్నాను నేను కూడా. కాదంటారా వెంకటప్పయ్యగారూ?

    ReplyDelete
    Replies
    1. ఈ కవిత చెన్నా ప్రగడ భానుమూర్తి గారిదనే ఒక వాదన ఉంది లెండి!

      Delete
  4. తెలుగు పద్యము జాలురా తెలుగువాడ తెలుగు పద్యమే ఘనమైన వెలుగు నింపు తెలుగు పద్యమ్ము వినినంత ధన్య మౌను
    తెలుగు పద్యము హృద్యము తెలియు మయ్య!!

    ReplyDelete