Monday, October 14, 2013

'ప్రబంధ పరమేశ్వరుడు ' ఎఱ్రాప్రగడ 2

లీలా ప్రసాద్ గారు అందించిన పద్యాలు 

-------- : ఎఱ్ఱన వారి వర్ణనలు : -------
: శ్రీకృష్ణుని సమాధి యోగ వర్ణన :

సీ: స్వస్తికాసనము నిశ్చలముగా బంధించి
తనువుగంధరయు మస్తకము సరిన
చక్కనై నిలువ నాసాశిఖరంబున
నరమోడ్పుచూడ్కి యేకాగ్రసరణి
నిలిపి మూలాధారా నిర్గత నిర్గుణ
ధామంబు షడ్సంధి దళనకారి
యైపోయి పరమాంబరామృతబింబంబు
గరపoగc దోడన తొరcగు సోనc

తే:గీ: దడసితన్మయానంద తంద్రాళువగుచు
నొకcడు నెఱుcగని సామరసస్యోదయమున
నలరనెంతయు నొప్పినయ్యాదిసిద్దు
డఖిల సిద్ధులు దనసిద్ధియభినుతింప ....

స్వస్తికాసనంలో కూర్చుని చూపును నాసాగ్రంలో నిలిపి, కుండలినీశక్తిని, మూలాధారం నుండివరుసగా షడ్గ్రoదులను భేదించుకొని, సహస్రారచక్రానికి చేరుకొని, అమృతబిందువులతో తడిసి,పరమేశ్వర సమాగమంతో కృష్ణుడు తన్మయానంద తంద్రాళువయ్యాడని, అన్యులెరుగని సామరస్యోదయంతో సిద్ధినిపొంది, ఈశ్వరప్రణిదానంతో అనంతమైన అఖండజ్యోతితో, తన ఆత్మజ్యోతినిఅనుసంధానం చేసాడని చెప్పటం ఈ యోగావిద్యలో ఎఱ్ఱన అనుభవసారాన్ని తెలుపుతుంది.

------ అరుణరాగాల శ్రీకారం ------
చం: స్ఫురదరుణాoశురాగరుచిc బొంపిరివోయి నిరస్తనీరద
వరణములై దళత్కమల వైభవజృoభణముల్లసిల్లను
ద్దురతర హంససారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళ చూడగన్ ....

శరత్కాలంలో, సూర్యోదయ సమయాలు కన్నులపండువుగా శోభిస్తుంటే, మబ్బులు తొలగిపోయి, బాలభానుడి అరుణకిరణాలు విస్తరిల్లాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా వెలుగొందాయి.హంసలు, బెగ్గురు పక్షులు,తుమ్మెదలు చేసే కలరవాలు వెల్లివిరుస్తాయి....

                                                     

రావినూతల శ్రీనివాస్ గారు అందించిన పద్యాలు 

ఎర్రన లేదా ఎర్రా ప్రగడ కవిత్రయంలో రెండవవాడు. నన్నయ అసంపూర్తిగా వదలివేసిన అరణ్య పర్వాన్ని తెలిగించాడు. నన్నయ చివరి పద్యంలో శరద్రాత్రుల వర్ణన జరిగింది. అదే వర్ణనను ఎర్రన కొనసాగించాడు. ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం..

స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ
ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్

ఈ పద్యంలో శారద రాత్రుల వర్ణనతో పాటు ముందు ముందు దుర్యోధనాదులకు సంభవించే పరాభవాలు సైతం గర్భితంగా ఉన్నట్లు పండితులంటారు. అవమానాలకు గురైన దుర్యోధనాదులను పాండవులు విముక్తి చేయడాన్ని కూడా ఇందులో ఎర్రన పొందుపరచాడంటారు.

మహాభారతాంతర్గతంగా ఎర్రన చేసిన సరస్వతీ స్తుతి. తెలుగు కవుల అనేక సరస్వతీ ప్రార్ధనలలో ఉత్తమమైన వానిలో ఇది ఒకటి. పోతన వంటి తరువాతి కవుల స్తుతులకు మార్గదర్శి.

"మత్సమాగమమున మదిరాక్షి। నీదు క 
న్యావ్రతంబు చెడదు,నందనుండు 
నధిక తేజుడుదయమగు;నిన్ను లోకనిం 
దయును బొందకుండుదధ్య మబల । "

ఈ పద్యము భారతంలో ఎర్రన రచించినది. కర్ణ జననం గురించి వివరించిన సందర్భంలోనిది. 

కుంతి భోజుడి దత్త పుత్రిక కుంతీదేవి. ఒకనాడు కుంతిభోజుడి రాజ్యానికి దూర్వాసమహర్షి వస్తాడు. ముక్కోపి ఐన మహర్షికి సేవలు చేయడానికి కుంతిభోజుడు తన కుమార్తె కుంతీదేవిని నియోగిస్తాడు. కుంతీదేవి ఎంతో వినయంగా,సహనంతో మహర్షి సేవలు చేసింది. మహర్షి కుంతీదేవి సేవలను మెచ్చుకొని కుంతికి మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రం వల్ల ఏ దేవతాముర్తిని స్మరిస్తే వాళ్ళు వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తారు.ఒకనాడు కుంతీదేవి ఎంతో ప్రకాశంగా,ఉజ్జ్వలంగా వెలుగుతున్న సూర్యబింబాన్ని చూసి బాల్యచాపల్యంతో సూర్యుడిని తలచుకొని ఆ మంత్రాన్ని స్మరించింది. ఆ మంత్రం యొక్క ప్రభావంతో సూర్యుడు కిందకు దిగి వస్తాడు. వచ్చిన సూర్యనారాయణమూర్తిని చూసిన కుంతి తాను చేసిన పనిని తలచుకొని భయపడి సూర్యుడిని వెళ్ళిపొమ్మంటుంది. కానీ సూర్యదేవుడు వరం ఇచ్చి కానీ వెళ్ళనంటాడు . కుంతి భయపడుతుంటే సూర్యుడు "కుంతీ, నా సమాగమువల్ల నీ యొక్క కన్యాత్వం చెడదు. నీకు నా వల్ల అధిక తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. నా మహిమ వల్ల నీ గర్భసూచనలు లోకానికి తెలియదు. దీనివల్ల నిన్ను లోకము నిందించదు."

"కొడుకు గనియె సహజ కుండల కవచాభి 
రాము,విమలకమలకోమలాక్షు 
దీర్ఘ బాహు జారుద్రుఢ దేహు దరుణార్క 
తేజు గుంతిభోజరాజపుత్రి ।"

సూర్యవరప్రభావంతో కుంతీదేవికి కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడు ఎలావున్నాడో ఎర్రన గారు ఈ పద్యంలో ఎంతో చక్కగా వివరించారు. "ఆ బాలుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. చక్కని,అందమైన,తామరపువ్వు లాంటి కళ్ళు కలిగి ఉన్నాడట. ఆ బాలుడు దీర్ఘమైన,విశాలమైన బాహువులు కలిగి,దృఢమైన దేహంతో,సూర్య తేజస్సును కలిగిఉన్నాడట."

అరణ్యపర్వములోని మరొక పద్యము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్న మాటలు.

ద్యూత వ్యాజమునన్ సభాంగణములో దుర్యోనుండట్లు దు
ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంప ధైర్యోన్నతిన్
జేతఃస్ఫారుఁడవైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ వి
ఖ్యాత క్షాంతులు లేరె ధార్మికులు నిక్కంబిట్టిరే యెవ్వరున్

నృసింహపురాణము పీఠికలో నన్నయ తిక్కలను గురించీ, తన యభీష్టసిద్ధి గురించీ ఎర్రన ఇలా అన్నాడు....

భాసుర భారతార్థముల భంగులు నిక్క మెఱుంగ నేరమిన్
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికిన్
వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లఁగఁజేసినట్టి య
బ్జాసన కల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్

విష్ణుభక్తులకు కలిగే మేలు గురించి నృసింహపురాణంలో వర్ణన:

పొందవు దుఃఖముల్ భయము పొందరు పొందరు దైన్యమెమ్మెయిన్
బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్
పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తులెందు గో
వింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్

అక్కట యమ్మహారణమునందు వియఛ్చరకోటితోడ బే 
రుక్కున బోరి యేను మృతి నొందగ నేరన, యట్టులైన నీ 
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్ 
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై 

ఇది ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వములోని షష్టాశ్వాసము నుండి గ్రహించబడిన పద్యము.. దీనిని ఎర్రన రచించారు.. ఇది ఘోష యాత్ర సమయంలో దుర్యోధనుడు స్వగతం లోనిది. పాండవులని కించపరచడానికి, పాండవుల ముందు తన గొప్పలు చాటడానికి దుర్యోధనుడు తన పరివారం తో ఘోష యాత్ర చేస్తాడు. ఆ సమయం లో చిత్రాంగదుడు అనే గంధర్వుడు తో దుర్యోధనుడు యుద్ధం లో ఓడిపోయి భీమార్జునుల ద్వారా రక్షించబడతాడు. 'శత్రువుల చేత రక్షింపబడిన ప్రాణాలు ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ యుద్ధంలో నేను చనిపోయి ఉంటే నాకు ఈ భూమి మీద కీర్తి అయినా మిగిలి ఉండేది కదా' అని దుర్యోధనుడు స్వగతంలో అనుకున్న సందర్భంలోనిది.


No comments:

Post a Comment