Tuesday, October 22, 2013

శ్రీనాథ కవిసార్వభౌముడు 1

పరవస్తు నాగసాయి సూరి 

పలనాడులో శ్రీనాథుడు
-----------------------------------
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చాటక ముందే.... కన్నడ రాజ్యాన తెలుగు భాషకు సువర్ణాభిషేకం చేయించిన మహాకవి.... కవిసార్వభౌముడు... శ్రీనాథుడు. ఆయన తన కవనం గురించి కాశీఖండంలో ఇలా చెప్పారు. 
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.
పండిత వంశంలో పుట్టిపెరిగిన శ్రీనాథుడు బాలకవి. వయసుకు తగ్గ రచనలు చేస్తూ... తెలుగు తల్లికి రతనాల అభిషేకం చేశాడు. స్వతహాగా భోజనప్రియుడైన శ్రీనాథుడు... తాంబూల ప్రియుడు కూడాను. ఆయనతో వచ్చే వందలాది మందికి భోజనాలు ఏర్పాటు చేసిన దానికంటే... ఆయన తాంబూలానికే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేవారు. అలాంటి కవిరాజు... వేమనాథుడు మరణించాక... కొండవీడు వదలిపెట్టి... పల్నాడు చేరుకున్నారు. అక్కడి కరవును చూసి... శ్రీనాథుడు మరింత ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాలను తన చాటువుల్లో రాశారాయన. అక్కడ అడుగిడుతూనే....
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు
అంటూ అక్కడి పరిస్థితుల్ని ఒకే పద్యంలో అల్లారాయన. అక్కడి ఆహారపు అలవాట్లు శ్రీనాథునికి మింగుడు పడలేదు. అక్కడి జొన్న అన్నం తినలేకపోయారు. అప్పుడు...
జొన్న కలి, జొన్న యంబలి, 
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్
సున్న సుమీ సన్నన్నము
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్
అంటూ అక్కడ జొన్నన్నము తప్ప మరేమీ దొరకదని దెప్పి పొడిచారాయన. అంతేనా... తినలేని తన పరిస్థితి చూసి శివుడు నవ్వుతున్నాడని భావించి... ఆ గరళకంఠునికే సవాలు విసిరాడు శ్రీనాథుడు.
గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ
నిత్య శివదీక్షాపరుడు గనుకే... అంత ధైర్యంగా... ఆయనకు సవాలు విసర గలిగారు. అంతకంటే ముందు అడుగు పెడుతూనే... అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి....
రసికుడు పోవడు పల్నా 
డెసగంగా రంభయైన నేకులె వడకున్‌
వసుధేశుడైన దున్నును 
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌
అంటూ అక్కడి పరిస్థితిని వివరించారు. రసికుడైన వాడు పల్నాడు పోడంట. అక్కడ రంభ లాంటి అందగత్తెలు కూడా ఏకులు వడుకుతారట. ఎంత రాజైనా... వ్యవసాయం చేసుకుని బతకాల్సిందే. ఎంతటి సుకుమారుడైనా... జొన్న అన్నమే తిని బతకాలంట.
ఆ ప్రాంతాన్ని ఇంత తేలిగ్గా చెప్పిన శ్రీనాథుడు.. చివరకు అక్కడి పల్నాటి వీరచరిత్రను గ్రంథంగా రాశారు. అదంతా ఆ చెన్నకేశవుడి మహిమే అని చెబుతారు. పల్నాటి మీద పలు మాటలు తూలినందుకు అక్కడి వీరుల చరిత్రను రాసి తన తప్పును దిద్దుకోమని చెన్నుడే... ఆ మహాకవికి చెప్పాడని నమ్మిక. నిజమే లేదంటే... ఆ ప్రాంతం మీద అంత హేళనగా పద్యాలు రాసిన మహాకవి... అక్కడి వీరుల చరిత్రను రాయడం విశేషమే మరి. పల్నాటి వీరచరిత్రను... మంజరీ ద్విపద కావ్యంగా రాశారు. ఇదే ఆయన చివరి రచన కూడా అని చెబుతారు. బాలచంద్రుని యుద్ధ ఘట్టము మాత్రమే శ్రీనాథుడు రచించాడని కొందరు పరిశోధకుల అభిప్రాయం కూడా. లేదంటే... ఆయన రాసిన పూర్తి గ్రంథం కాల గర్భంలో కలిసిపోయిందేమో తెలియదు. కవిత, వనిత, లత ఆశ్రయం లేకుంటే మనుగడ సాగించలేవని మన పెద్దలు చెబుతారు. సరైన ఆశ్రయం లేకే... ఆ రచనకు అలాంటి దుర్భర స్థితి పట్టిందేమో అని చెబుతుంటారు.

                              



శృంగార శ్రీనాథుడు
మన్మధుని కొంప ఒక చెంప కనిపింప చీరగట్టి నడియెన్ చిగురుబోడి మకరధ్వజునికొంప యొక చెంప కనుపింప జీర కట్టినదయా చిగురుబోడి యుభయపక్షములందు నురుదీర్ఘతరములౌ నెరులు పెంచినదయా నీలవేణి పసుపు వాసన గ్రమ్ము పైట చేలము లెస్స ముసుకు బెట్టినదయా ముద్దుగుమ్మ పూర్ణచంద్రుని బోలు పొసగు సిందూరంపు బొట్టు పెట్టినదయా పొలతి నుదుట నెమ్మి మీరంగ నిత్తడిసొమ్ములలర నోరచూపుల గుల్కు సింగార మొల్క గల్కి యేతెంచె మరుని రాచిల్క యనగ వలపులకు బేటి యొక యొడ్డె కుల వధూటి
చక్కని నీ ముఖ చంద్రబింబమునకు గళ్యాణమస్తు బంగారు బొమ్మ నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు నైశ్వర్యమస్తు నెయ్యంపుదీవి మీటిన బగులు నీ మెరుగు బాలిండ్లకు సౌభాగ్యమస్తు భద్రేభయాన వలపులు గులుకు నీ వాలు గన్నులకు న త్యధిక భోగోస్తు పద్మాయతాక్షి మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును వైభవోన్నతిరస్తు లావణ్యసీమ వన్నెచిన్నెలు గల్గు నీ మన్ననలకు శాశ్వతస్థితి రస్తు యోషా లలామ
సిరిగలవానికిజెల్లును తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.
శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌ సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌ మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ
తొలకరి మించుతీగె గతి దోప దుకాణము మీద నున్న యా యలికులవేణితో దములపాకుల బేరము లాడబోయి నే వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముడు లింగరూపమై కలికిమిటారి గుబ్బచనుగట్టుల సందున నాట్యమాడగన్
"పనివడి నారికేళ ఫలపాకమునంజవియైన భట్టహ ర్షుని కవితాను గుంభములు సోమరిపోతులు కొందఱయ్యకౌ నని కొనియాడనేరదియట్టిద, వేజవరాలు చెక్కుగీ టిన వసవల్చు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే?"
శ్రీనాథుడు "అర్థం కాదు - కొరకరాని కొయ్య " అనే వారిని చూసి చిరాకు పడిఉంటాడు. కాబట్టి మంచి ఉపమానంతో ఇలా అన్నాడు - "మాంచి వయసులో ఉన్న కన్య చిన్నపిల్లాడి చెక్కు గీటితే ఆ పిల్లాడిలో ఏ భావం ఉంటుంది?". అంటే సరసానికైనా విరసానికైనా ఒక స్థాయి ఉండాలి. లేకపోతే అపాత్రదానంలా, అరసికుని కవిత్వంలా వ్యర్థమై పోతుంది. కాబట్టి ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్థాయి లేకుండా విమర్శించేవారు - అదిగో ఆ బాలుని వంటి వారే - అని భావం. ఇది కవిత్వానికే చెప్పినా అన్ని చోట్ల, అన్ని రంగాలకూ వర్తిస్తుది.
ఆయన అందం ఎక్కడున్నా హర్షించాడు, కుత్సితం ఎక్కడున్నా గర్హించాడు. ఇంత విశాల దృక్పథం మరో పూర్వకవిలో కనిపించదు. ఈయన కంటికి నచ్చిన స్త్రీలు అన్ని వర్గాల వారూను - వ్యాపారి, నంబి, కమ్మ, రెడ్డి, జంగము, కాపు, శబర, ద్రావిడ, బలిజ, గానుల, వాసర, విప్ర, క్షత్రియ, శూద్ర, నియోగి, కర్ణాట, కాసల్నాటి, వైష్ణవ, సాతాని, అగసాలె, వడ్డెర, కుమ్మరి, చాకలి, ముస్లిం, ఇలా ఎందరెందరో. వీళ్ళలో ఎవరినీ ఎక్కువగానూ మరెవర్నీ తక్కువగానూ చూడడు. ఆయన దృష్టిలో సౌందర్యమే ప్రధానం, మిగిలినవన్నీ అనవసర విషయాలు. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి -
గిట గిట నగు నెన్నడుములు పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో జిట పొట లాడెడు మొగములు కటి తటముల కొమరు శబరకాంతల కమరున్‌ నిబ్బరపు గలికిచూపులు జబ్బించుకలేని పిరుదు సన్నపు నడుమున్‌ మబ్బు కురు లుబ్బు కుచములు బిబ్బీలకు గాక కలవె పృథివీస్థలిపై
కుంకుమ కేళి సల్పెడు ప్రకారమునం బురుషాయిత క్రియా తాండవ రేఖ చూపెడు విధంబున, పామర భామ లేద యీ రెండ ప్రభాతవేళ రచియించి నితంబ భరంబు, చన్నులున్‌ కుండలముల్‌, కురుల్‌ కదలగోమయ పిండము వింటి ముంగిటన్‌
ప్రాత: కాలంలో ఇంటిముందు పిడలకుగాను పేడ ముద్దలను చేస్తున్న ఓ పల్లెటూరి స్త్రీని వర్ణిస్తున్నాడు కవి. ఆమె పేడ ముద్దలను చేస్తున్నతీరును శృంగార క్రీడలాగా గోచరమవుతున్నట్లు కవి వివరిస్తాడు. ఎక్కడ అందం సాక్షాత్కరమవుతుందో అక్కడ శ్రీనాథుడు కొలువుతీరడాతు, అతని పద్యం ఆ అందానికి ప్రతిబింభమై నిలుస్తుంది.
బిగువై, వట్రువలై, విరాజితములై, బింకంబులై, యుబ్బులై నగసాదృశ్యములై, మనోహరములై, నాగేంద్ర కుంభంబులై సొగసై,బంగరుకుండలై, నునుపులై, సూనాస్త్రు జేబంతులై బిగి చేబట్టు కుచద్వయమంబులకు నాశీర్వాదమబ్జాననా!
వర్ణన చేయదగ్గ వస్తువేదైననూ కవిత్వం మాత్రం సహృదయులకు గిలిగింతలుపెడుతుంది. మనసును మరో లోకంలోకి తీసుకువెళ్తుంది.
నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.

అందుకే రాజాశ్రయం లేక శ్రీనాథుడు చివరి రోజుల్లో తీవ్ర మనో వేదన అనుభవించారు. చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అవమానాన్ని పద్యంగా పొందు పరిచారు....
కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
అంతేనా... మరణాకి ముందు కూడా.... తన వైభవాన్ని ప్రకటించారు శ్రీనాథుడు.
కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
తన కవితా వనితను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరూ నింగికేగారు. ఈ కలియుగంలో ఇక ఉండ లేనంటూ... అమర పురికి ఏగాడు శ్రీనాథుడు. ఆయన స్వర్గానికి వెళ్తుంటే... అక్కడ అప్పటికే చేరిన కవి రాజు గుండెల్లో అలజడి ప్రారంభమైందట. మరణంలో కూడా ఇంత అద్భుతమైన భావన మిగిల్చిన ఆ కవిసార్వభౌమునికి తెలుగుజాతి... ముఖ్యంగా పలనాటి ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు.

1 comment:

  1. శ్రీనాథుని గురించిన మీ కథనం అత్యద్భుతంగా ఉన్నది. శ్రీనాథుడు నాకు అభిమాన కవి. వారిని గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు

    ReplyDelete