Monday, May 26, 2014

ఇచ్చుటలో ఉన్న హాయి...

ఇచ్చుటలో ఉన్న హాయి...
ఆ మధ్యన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు.... ఈ మాటలు న మనోపధంలో ముద్రించుకు పోయాయి...
"చూడండి... మీరు యెంత కష్టపడి, ఎన్ని కోట్లు సంపాదించి, పిల్లలకు ఇచ్చినా... వాళ్ళు ఏమంటారంటే...
మా నాన్న ఉన్నాడు చూసారా? దొంగ వెధవ... అదిగో ఆ ఎదురుగుండా ఉన్న భవంతి ఉంది కదా, అది నాకు ఇవ్వకుండా పోయాడు, చచ్చినాడు.(అంతే కాని, ఇచ్చిన వాటి గురించి చెప్పాడట...)
మా అమ్మ ఉందే ! ఎంత చాకిరీ చేసాను, చివర్లో కాసులపేరు కోడలికి ఇచ్చి పోయింది..."
మనిషికి తృప్తి ఎక్కడండి ? ఎంత ఇచ్చినా, ఇచ్చింది గుర్తుండదు. ఇవ్వని దాన్నే చెప్తారు. అందుకే, నేనైతే నా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవట్లేదు. వచ్చిననంత వస్తుంది. ఉన్నంతలో విద్యాబుద్ధులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నేను ముప్ఫై ఏళ్ల నుంచే తీర్థ యాత్రలు చేస్తున్నాను. అదనంగా వచ్చిన సొమ్మంతా దానధర్మాలకు వాడేస్తాను. పిల్లలకు అతిగా ఆస్థులు ఇవ్వడం అంటే, వాళ్ళను కష్టం తెలియకుండా ఇంక్యుబేటర్ కోళ్ళు పంచినట్లు పెంచడమే ! ఈ విధానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. మీకు నిజంగా పిల్లలపై ప్రేమే ఉంటే, వాళ్లకు చదువుసంధ్యలతో పాటు కాస్తంత ఆస్తినే ఇవ్వండి.
వాళ్లకు బెంజి తెలియాలి... గంజి తెలియాలి. లోకం చూడాలి, అనుభవం పెంచుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. ఇక ఆస్థి తక్కువ ఇస్తే, వాళ్లకు అనుకోని అవసరాలు వస్తే... అంటారా ? నేను ఈ రోజున చేసిన దానధర్మాలు వాళ్ళను అవసరంలో ఆదుకోకపోవు. దైవానుగ్రహం ఉన్న వాళ్లకు జీవితంలో డోకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అతిగా ఆస్థులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టకండి ..."
నేనలా ఆయన చెప్తుంటే చూస్తూ ఉండిపోయాను. ఎంత చక్కగా చెప్పారు... నిజంగా 'వసుధైక కుటుంబకం ...' అన్న వారి సూత్రం అంతా పాటించగలిగితే, ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉండవు కదా !