Wednesday, March 16, 2016

పట్టుదలతో సాధించిన విజయం

“నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, ఎంతో ప్రేమిస్తున్నావు, కాని చెప్పవు. నాకోసం తపిస్తావు, కాని దాన్ని బైటికి చూపించవు. నా దగ్గరికి రావాలనుకుంటావు, నన్ను హత్తుకోవాలి అనుకుంటావు, గుండెల్లో కొలువుండాలని అనుకుంటావు, కాని ఉండవు. కాని నేను, నీలాగా కాదు, “నువ్వంటే నాకు ప్రేమ” అన్న విషయాన్ని చెప్పకుండా నేను అస్సలు బ్రతకలేను.” అంటాడు హీరో హీరొయిన్ తో.
“నీ లాంటి మగవాళ్ళు మా లాంటి ఆడవాళ్ళకు తరతరాలుగా చేసింది ఇదే. కొన్నిసార్లు కడుపులోనే చంపేస్తే, కొన్నిసార్లు పుట్టగానే చంపేసారు. ఇదేమి విచిత్రమైన సంప్రదాయం? అన్నీ మావి, కానీ ఉండేవి మీపేరుతోనేనా?పాపిడి మాది, ఆ పాపిట దిద్దే సింధూరం మీపేరుతో, మెడ మాది మాంగల్యం మీ పేరుతో , చేతులు మావి, గాజులు మీ కోసం వేసుకునేవి. ఇది ఎంతదాకా అంటే, గర్భం నాది, రక్తం నాది, పాలు నావి, పుట్టే బిడ్డ మాత్రం మీ పేరుతో ఉంటుందా ? అన్నీ మీ పేరుతోనే ఉంటాయి. అయితే, నీ దగ్గర నా పేరుతో ఏముందో చెప్పగలవా ?” తనను చంపబోయిన భర్తను నిలదీస్తుంది ఒక భార్య.
సాధారణంగా ఎవరైనా సినిమా చూసినప్పుడు, తెరమీది బొమ్మలే చూస్తారు. కాని నేను, తెరవెనుక ఉన్న అక్షరాల పదును చూస్తాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు మొదట ఆశ్చర్యం కలిగింది. అక్షరం అక్షరం, నటీనటులు పలికే ప్రతీ పదం, సూటిగా ప్రేక్షకుడి మనసుకు ఎక్కుపెట్టిన బాణం ! ఈ సినిమాకు కధ, డైలాగ్ లు ఎవరు రాసుంటారు? ఆద్యంతం ప్రేమను ఒక అద్భుతంగా, సమున్నతంగా చూపిన ఇంతటి ఔన్నత్యం ఉన్న రచయత ఎవరు ? వెంటనే గూగుల్ సెర్చ్ చేసాను. ఆశ్చర్యం ! సినిమాకు కధ రచయత కాదు, రచయిత్రి. ఆమె గురించి మరిన్ని ఇంటర్వ్యూలు , విశేషాలు చదువుతుంటే మరింత ఆశ్చర్యం వేసింది. ఆమె పేరు – షాగుఫ్తా రఫీక్, ఆ చిత్రం పేరు ‘హమారీ అధూరి కహాని’.
బాణం వెనక్కు ఎంత బలంగా లాగి వదిలితే అంత ముందుకు వెళ్తుందట. బంతిని నేలకేసి ఎంత బలంగా కొడితే, అంతే వేగంతో ఎత్తుకు ఎగురుతుందట ! అలాంటిదే షాగుఫ్తా జీవితం. ఆమె తల్లి(పెంచిన తల్లి, ఆమెను ఎక్కడినుంచో తెచ్చుకుని) ఒక గొప్ప కలకత్తా వ్యాపరస్తుడికి “అజ్ఞాత భార్య”. అతను చనిపోతూ ఈ కుటుంబానికి ఏమీ ఇవ్వలేదు. బాలీవుడ్ లో “వాలే నక్షత్రం” లాంటిది వాళ్ళ అక్క జీవితం. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక, నిరాశతో ఉండగా, షాగుఫ్తా బావ తాగిన మత్తులో సరదాకి ఆమెను షూట్ చేసి, చివరికి మత్తు వదిలాకా తన జీవితాన్నీ ముగించుకున్నాడు. అమ్మ, షాగుఫ్తా... పేదరికం, ఆకలి మిగిలారు.
ఫలితం – పదకండేళ్ళ వయసులో ఒంటికి కప్పుకున్న చున్నీ తీసి, నడుముకి కట్టుకుని, ఆమె బార్ డాన్సర్ అయ్యింది. మొదటిసారి – అయినా చాలా డబ్బులు వచ్చాయి. మనిషి పొందే గౌరవాన్ని డబ్బు ఎలా శాసిస్తుందో, అప్పుడే ఆమెకు తెలిసింది. ఆమెకు నాట్యం తెలిసి ఉండడంతో, సుమారు 6 ఏళ్ళ పాటు ‘బార్ డాన్సర్’ గా కొనసాగిన ఆమె, 17 ఏళ్ళ వయసులో ఓ ధనికుడికి సేవికగా వెళ్లి, అతని వద్ద నరకం చూసింది. అతన్నుంచి తప్పించుకునేందుకు ఆమె వేశ్యగా మారాల్సి వచ్చింది.
“అదొక విషవలయం. అతని నుంచి తప్పించుకోడానికి వేశ్యగా మారాను, ఆ వృత్తి నుండి తప్పించుకోడానికి మళ్ళీ బార్ డాన్సర్ గా మారాను, ముంబై నుంచి తప్పించుకోడానికి దుబాయ్ చేరాను, అలా కొనసాగింది.” అంటుంది ఆమె.
నలిగిన మల్లె లాంటి ఈ జీవనం ఆమెలోని రచనా పటిమను ఆమె గుర్తించేలా చేసింది. వేశ్యలు, బార్ డాన్సర్ ల జీవితాలు, ధనికుల, కాముకుల దాహాలు, స్వార్ధం కోసం అమ్మాయిల్ని అమ్మే బ్రోకర్లు, కళ్ళ ముందే దయనీయమైన చావులు... ఎదురైన ప్రతి జీవితాన్ని కధగా రాసింది. మనసును గుచ్చిన ముళ్ళను, గాయపు ఆనవాళ్ళను తనకొక దారి చూపేలా మలుచుకోవాలని అనుకుంది.
భారత్ కు తిరిగి వచ్చాకా, ఎలాగైనా సినిమా రచయిత్రిగా మారాలని అనుకుంది. టీవీ స్టూడియో లు, ప్రొడక్షన్ హౌస్ లు అనేకం తిరిగింది. ఎక్కడా అవకాశం దొరకలేదు. 2000వ సంవత్సరంలో మహేష్ భట్ ను కలిసి ఆయన ప్రొడక్షన్ హౌస్ లో చేరటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 2006లో ‘వొహ్ లమ్హే’ అనే చిత్రానికి తొలిసారిగా తన  37ఏళ్ళ వయసులో స్క్రిప్ట్ రాసింది. అప్పటినుంచి దాదాపు 11 సినిమాలకు పనిచేసింది. అన్నీ దాదాపుగా విజయాలే, చీకటి బ్రతుకుల లోలోపల వెలిగే మనసు దివ్వెలను ప్రతిబింబించే అద్దాలే !
“దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది” అయినా, పీకూ లాంటి చిత్రాల్లో హీరొయిన్లు ఆధునిక భావాలతో ‘నాకు చాలామందితో సంబంధాలు ఉన్నాయి’ అని చెప్పుకుంటూ విజయాలు సాధిస్తున్న ఈ రోజుల్లో... పాత చింతకాయ పచ్చడి లాగా... ఈ మాంగల్యం, భర్త, సెంటిమెంట్లు ఏమిటి? ఇది నిజంగానే అధూరి (అసంపూర్ణ) కధ లాగా ఉంది.” ఒక ప్రముఖ దినపత్రికలో ఈ చిత్రంపై వచ్చిన రివ్యూ ఇది. చదవగానే కాస్త బాధ కలిగించింది నాకు. వారికి ఇలా సమాధానం ఇవ్వాలని అనిపించింది.
“కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది జీవితం విలువ... ఆమె ప్రేమని, పెళ్లిని పొందలేకపోయింది, అందుకే వాటి విలువని ప్రతిబింబించే కధలని రాసింది. కొత్త చిత్రాల్లో ఎన్ని పోకడలు చూపినా... భారతీయ స్త్రీ ఈ నాటికీ భర్తకూ, మాంగల్యానికి దైవానికి ఇచ్చినంత విలువని ఇస్తుంది. ముళ్ళలో గుబాళించే ఆ గులాబి కూడా, ఆ పరిమళాన్నే ఈ సినిమాలో అందించింది.”
కొండంత ప్రేమను కనీసం జీవితంలో ఒక్కసారైనా పొందాకా, ఆ వ్యక్తి ఇక ఆ ప్రేమించినవారిని తలుచుకుంటూ, ఆనందంగా తనను తాను చావుకు అర్పించుకోవచ్చు. దీన్నే క్లైమాక్స్ లో అద్భుతంగా రాసి, హిమేష్ చేత పండింపచేసారు. రెప్ప వెయ్యకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ సినిమా.
“ఇప్పటికీ నన్ను పార్టీలకు, ‘ఆమె బార్ డాన్సర్ అట, ఏ వేషంలో వస్తుందో చూద్దాం,’ అన్న ఉత్సుకతతో పిలుస్తారు, నన్ను చూసాకా నిరాశ చెందుతారు,” అంటుంది షాగుఫ్తా. ఇటువంటి సమయాల్లోనే గతాన్ని నిజాయితిగా చెప్తూ, అదే తన బలానికి మూలమని చెప్పిన ఆమెలో అపవిత్రత ఉందా, లేక ‘అలాంటిదట, ఎలా ఉంటుందో చూద్దాం’ అని ఉత్సాహ పడే వారి కళ్ళలో అపవిత్రత ఉందా అన్న సందేహం కలుగుతుంది. ఎక్కడ పుట్టినా, ఎలా పెరిగినా షాగుఫ్తా లో ప్రవహించేది భారతీయ రక్తం. ఆమె అక్షరం అక్షరంలో ఉన్నది సత్యం. ఆమెకు గురువు జీవితం. అందుకే, ఆమె నిజాయితీతో కూడిన రచనా పటిమతో మున్ముందుకు సాగిపోతోంది. వీలుంటే, ఈ చిత్రాన్ని తప్పక చూడండి.