Sunday, August 7, 2016

స్నేహోత్సవ శుభాకాంక్షలు

మీకు ఎంత ఆకలిగా ఉన్నా, "ముందు నువ్వు తిను" అంటూ చేతిలో ఉన్న ఆహారాన్ని ఎవరికి అందిస్తారో... వారే మీ ప్రియ స్నేహితులు.

మీరు ఎంత అలిసిపోయి ఉన్నా. " ఆ కళ్ళు చూడు ఎంత లోతుకు పోయాయో, నువ్వు పడుకో, నీ పని నేను చేసేస్తాను" అంటూ ఎవరితో అంటారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీరెంత భయస్తులు అయినా, ఆ భయాన్ని పక్కకు నెట్టి, "నీకెందుకు, నువ్వెళ్ళు, నేను చూసుకుంటా" అని ఎవరితో అంటూ, ప్రాణాన్నిఅయినా పణంగా పెట్టేందుకు సిద్ధపడతారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీరెంత పెదవి విప్పకుండా మౌనంగా నవ్వుతూ కూర్చున్నా, "ఏమైంది, ఏంటి సంగతి?" అంటూ మీమనసును చదివేస్తారో - వారే మీ ప్రియ స్నేహితులు.



మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు "నీ సత్తా ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నువ్వేదైనా చెయ్యగలవు, పద నీ వెంట నేనున్నాను, "అంటూ వెన్నంటి ముందుకు నడిపిస్తారో - వారే మీ ప్రియ స్నేహితులు.

మీ బాధలో తనూ కలతనిద్రగా మారేవారు, మీ ఆనందంలో హాసరేఖగా మెరిసేవారు, మీ విజయంలో సోపానంగా మారి అంత ఎత్తునున్న మిమ్మల్ని చూసి మౌనంగా మురిసేవారు, మీ పరాజయంలో మున్ముందు దాగున్న కొత్త ఆశల్ని చిగురింపచేసేవారు, కష్టసుఖాల్లో మొట్టమొదట మీరు గుర్తుచేసుకునేవారు, అవసరంలో అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసేవారు - ఒకటేమిటి, అన్ని రూపాల్లో , అన్ని వేళలలో, మీకు తోడునీడగా ఎవరుంటారో - వారే మీ ప్రియ స్నేహితులు.



అటువంటి మిత్రులందరికీ "హార్దిక స్నేహోత్సవ శుభాకాంక్షలు !!!" - భావరాజు పద్మిని.

Saturday, August 6, 2016

మార్పు

దారంటూ మారాలంటే అటుగా తొలి అడుగు మీరేకండి!
మార్పంటూ రావాలనుకుంటే - ఆ మార్పు మీరేకండి !

మనం రోజూ ఎన్నో చూస్తూ ఉంటాము. వాటిలో కొన్ని మారాలని అనుకుంటాము. కాని, ఆ దిశగా తొలి అడుగులు మనమే వేస్తే... మనకు తెలియకుండానే మన వెనుక కొన్ని అడుగులు మన మార్గాన్ని అనుసరిస్తాయి. ఎలాగంటే...

1. మామూలుగా పిల్లల్ని ట్యూషన్ కి దింపి వస్తున్నాము. కూడా స్నేహితురాలుంది. దారిలో కర్వేపాకు కోసం ఆగాము. ఇక్కడ కర్వేపాకు కొనుక్కురాడానికి దొరకదు. కొట్టుకురాడమే , లేక అడిగి దర్జాగా కోసుకురాడమే ! ఎండ మండిపోతోంది. ఓ 80 ఏళ్ళ పెద్దాయన, చిన్న కాగితం ముక్క చూపించి, "మున్నీ, ఏ అడ్రస్ పతా హై?" అని అడిగాడు. తెలీదన్నాను. పక్కనే ఉన్న బడ్డీ కొట్లో అడిగి వెళ్తున్నాడు. అడుగు వెయ్యటమే కష్టంగా ఉంది ఆయనకి. అలా ఆయన వెళ్తుండగా, ఆ బడ్డీ కొట్టు వాడిని, "ఆ పెద్దాయన ఎంత దూరం వెళ్ళాలి?" అని అడిగాను. లోపలకు దాదాపు రెండు కిలోమీటర్లు, ఏదో డాక్టర్ దగ్గరకు వెళ్ళా లట. నాకు మనసూరుకోలేదు. "నువ్వెళ్ళు, నేనొస్తాను. ఆ పెద్దాయన్ని బండి మీద దింపేసి వస్తాను," అన్నాను. "నేనూ వస్తాను, కాని ఆయన్ని నేను స్కూటీ మీద మొయ్యలేను, కూడా ఊరికే వస్తా పదమంది" స్నేహితురాలు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి, బండి మీద ఎక్కించుకుని, ఆయనకు కావలసిన చోట దింపాను. నోరారా దీవించారు, తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. ఆ రోజెందుకో ఆయనలో నాకు నా ఇష్టదైవం భైరవుడు కనిపించారు. ఇదంతా నా స్నేహితురాలు చూస్తోంది, మరోసారి ఇటువంటి అవకాశం వస్తే, తను తప్పక చొరవ తీసుకుని, పెద్దవాళ్ళకు సాయపడుతుందని, తనను చూస్తే తెలిసింది.

2. ఉన్నట్టుండి హాయిగా తిరిగే తోటమాలి చనిపోయాడు. మూడు రోజులైంది, వంతులు వేసుకుని, నీ వాటా, నా వాటా అంటూ గిరి గీసుకుని పనులు చేసుకునే ఈ రోజుల్లో, మా ఫ్లాట్స్ చుట్టూ దాదాపు రెండెకరాల తోట, మొత్తం ఎండిపోయి, వడిలిపోయాయి మొక్కలు. నాకు మనసూరుకోలేదు. క్రిందికి దిగి, పైప్ అడిగాను. "మీరా, మీరు ఆ పైప్ బరువు కూడా మొయ్యలేరు," అంటూ నవ్వాడు సెక్యూరిటీ అతను. "ఇసుక ఇటుకలు, పలుగూ పారలు... అన్నీ పట్టిన చేతులివి. మమ్మల్ని ఆడపిల్లలని బలహీనంగా పెంచలేదు. కొండల్నైనా డీ కొనే ధైర్యంతో మగపిల్లల్లా పెంచారు, పైప్ ఎక్కడుందో చెప్పు," అన్నాను. ఆ పైప్ పెట్టి నెమ్మదిగా మొక్కలకి నీళ్ళు పోయసాగాను. నన్ను చూసి, నా స్నేహితురాలు కూడా దిగి వచ్చింది. దాదాపు, సాయంత్రం 4 నుంచి, రాత్రి 7 దాకా నీళ్ళు పోస్తూనే ఉన్నాము. తడిసిన మొక్కల్ని చూసాకా, అదొక చెప్పలేని తృప్తి. మర్నాడు ఇదంతా చూసిన గార్డ్ స్వచ్చందంగా మొక్కలకి నీళ్ళు పెట్టాడు.



3. పార్క్ లో సాయంత్రం వాకింగ్ కు వెళ్తూ ఉంటాను. ఆ రోజున మొక్కలన్నీ ట్రిమ్ చేసారు. ముళ్ళ చీమచింత కొమ్మలు, దారిలో అక్కడక్కడా పడున్నాయి. నడవలేక నడుస్తున్న పెద్దలు, ఉరకలెత్తే పిల్లలు అంతా అవస్థ పడుతున్నారు. నేను ఆ కొమ్మలు తీసి పక్కన వెయ్యటం మొదలుపెట్టాను. "శబ్బాష్ బేటా" అన్నారొక పెద్దాయన. వెంటనే నా పక్కన ఉన్న మరొక స్నేహితురాలు కూడా కొమ్మలు ఏరి పక్కన వెయ్యటం మొదలుపెట్టింది. మొదలంటూ పెడితే... వెనుక మరికొంతమంది అనుసరిస్తారు.

4. దాదాపు 55 ఫ్లాట్స్ ఉన్న భవంతి. ఇందులోనే రాత్రి కావలి ఉండే సెక్యూరిటీ గార్డ్ కాలికి పుండు వేసింది. నడవలేక, నిల్చోలేక ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళది ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్. పొట్ట చేతబట్టుకు ఇక్కడికి వచ్చాడు. ఇంతమంది రాత్రి పూట కళ్ళు మూసుకుని, భద్రంగా నిద్ర పోడం కోసం తన నిద్ర మానుకుని కాపలా కాసే అతను... నాలుగు మెతుకులు వండుకు తినలేని స్థితిలో ఉంటే... అందరికీ తెలిసినా, ఎవ్వరూ స్పందించలేదు. వెంటనే నేనే ఉదయం టిఫిన్ దగ్గరనుంచి, రాత్రి భోజనం దాకా వండి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇక్కడ చిక్కు ఏమిటంటే, వాళ్ళ ఆహారం వేరు (రొట్టెలు, కూర), మన అన్నం వేరు. అతను తినేవే విడిగా, వేడిగా వండి ఇచ్చాను. ఓ వారంలో కోలుకున్నాడు. ఈ లోపల నన్ను చూసి, మరికొంత మంది ముందుకు వచ్చారు. ఒకరోజు క్రిందికి దిగి చూస్తే, ఎప్పుడూ పిండిమరలో పిండి ఆడే అబ్బాయి ముఖంలా దుమ్ముకొట్టుకుని ఉండే నా స్కూటీ, కొత్త పెళ్ళికూతురిలా తళతళ లాడుతోంది. "courtesy pays back interest" అన్న వాక్యం గుర్తొచ్చింది. అతని మనసులో ఉన్న కృతజ్ఞతా భావం ఈ విధంగా తెలిపాడు.

5. ఓసారి నెలవారీగా నేను పేద పిల్లలకి(సుమారు 60-70 మందికి) వండి అన్నదానం చేస్తుంటే ఒకావిడ వచ్చి, ఎలా చెయ్యాలి, ఏవి యెంత కావాలి, మిమ్మల్ని చూస్తుంటే నాకూ చెయ్యాలని ఉంది, అని అడిగి, రాసుకుని వెళ్ళింది. అలాగే ఇక్కడి నా స్నేహితురాళ్ళు కూడా వండి వడ్డించడం మొదలు పెట్టారు. అలాగే గతంలో నా ఫేస్బుక్ పోస్ట్ లు చూసి, కొంతమంది స్వచ్చందంగా సేవ, ఆహారం పంచడం మొదలుపెట్టారు. వారంతా నాకు మెసేజెస్ ద్వారా వారు పొందిన ఆనందాన్ని తెలియచేసారు.



ఇవన్నీ నేను చాలా తీరిగ్గా ఉండడం వల్ల చేస్తున్నాను అనుకుంటే పొరబాటే. ఓ పక్క రేడియోలో పని చేస్తూ, ఓ పక్క నా పత్రిక పనులు, వేరే పనుల్లో బిజీ గా ఉండగానే ఇవన్నీ చేసాను. జీవితం అంటే మనకు ఇన్ని ఇచ్చిన సమాజానికి, తిరిగి మనం కూడా ఏదో విధంగా సేవ చెయ్యడం. అలా సేవ చేసే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే పరిసరాలు గమనించి ముందడుగు వెయ్యాలి. అలా మనతో మొదలైన మార్పు మరింతమందికి ప్రాకి, నవ సమాజానికి నాంది పలుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మొదలుపెట్టండి.