Wednesday, December 14, 2016

ఓ చల్లని వెన్నెల వేళ...

ఓ చల్లని వెన్నెల వేళ...
---------------------------
భావరాజు పద్మిని - 14/12/16

వెన్నెలంటే ఎవరికి ఇష్టముండదు? వలపు మండితే వగరు వెన్నెల, వలపు పండితే అగరు వెన్నెల, విరహాలు రేపే పొగరు వెన్నల, ఏటి అద్దంలో జిలుగు వెన్నెల, సందె పొద్దులో పసిడి వెన్నల... ఇలా వెన్నెల జ్ఞాపకాలు ప్రతి మనసులో పదిలమే ! అలాగే... తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక్కటే జాబిలి... తెలుగువారి హృదయాలలో ఒక్కటే వెన్నెల -సిరివెన్నెల ! ఆ వెన్నెల కళ్ళలో ఒక్క క్షణమైనా మెరవాలని, ఆ వెన్నెల భావాల్లో ఒక్క సెకనైనా తడవాలని, పుంభావ సరస్వతి వంటి ఆ వెన్నెల కాళ్ళకు మ్రొక్కి పునీతులు కావాలని, ఎన్ని మనసులు పరితపిస్తూ ఉంటాయో ! మరా మాటలాంటిది, పాటలాంటిది... రసమయకావ్యమై చెవుల్లో మారుమ్రోగే అక్షర లాస్యాలు... నిద్రాణమై ఉన్న హృదయ కవాటాల్ని తెరిచి, భావాల సుమగంధాలు రంగరించిన అమృతవర్షం కురిపిస్తాయి. ఆ పరవశంలో డోలలూగే మనసులు... "జీవితంలో ఒక్కసారైనా, ఎలాగైనా ఈ మహానుభావుడిని కలిసితీరాలి," అని తీర్మానించుకుంటాయి. నేనూ అంతే...

మొబైల్ స్క్రీన్ మీద ఆయన పేరుతో వస్తున్న కాల్ చూసి, ఒక్కక్షణం నా కళ్ళు చుస్తున్నది నేనే నమ్మలేకపోయాను. ఆయన నాకు ఫోన్ చేస్తున్నారా? హైదరాబాద్ వచ్చే ముందునుంచి ఆయనను కలిసే అదృష్టం కల్పించమని మెసేజ్/ఫోన్ చేస్తున్నాను. కానీ, ఆయన జవాబివ్వలేదు. ఇక కుదరదేమోలే అనుకున్న సమయంలో ఈ కాల్. ఉదయం గురువుగార్ని దర్శించుకుని, ఆయన దీవెనలు పొందినందుకు జరుగుతున్న అద్భుతమా ఇది ? ఉద్వేగాన్ని అణచుకుంటూ ఫోన్ తీశాను.
"ఏమ్మా పద్మిని, ఇప్పుడు 6.30 అయ్యింది, నువ్వు కలుస్తానని అడుగుతున్నావు కదా, రాగలవా? ఇప్పుడు చీకటి పడిపోతుందని అనుకుంటే రేపు ఉదయం రావచ్చు. "
ఆయన్ను కలిసే అదృష్టం ఉండాలే కానీ, అర్ధరాత్రి అడవిలోకైనా ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. 'ఇప్పుడొచ్చేస్తానండి ' అన్నాను. ఆయన అడ్రస్ చెప్పారు. వెంటనే కాబ్ బుక్ చేస్కుని బయల్దేరాను. తలుపు ఆయనే తీసారు. ఆఫీస్ అనుకుంటా...



ఆ గదంతా నీలి వెన్నెల, నిండు వెన్నెల... నీలిరంగు పెయింట్ వేసిన గదిలో, మబ్బుల మధ్య ఎదురుగా..."నా ఉచ్వాసం కవనం, నా నిశ్వాసం గానం..." అని రాసుంది. చుట్టూ ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న చిన్న ఫోటోలు డిజైన్ చేసి అంటించారు. ఇక ఆయన వెనుక... నింగి నుంచి కోసుకొచ్చిన జాబిలి దీపంలా పెద్ద గుండ్రటి లైట్. అందులోనూ ఆయన ఫోటోలు లీలగా కనిపిస్తున్నాయి. ఆయన ఎదురుగా ఒక చిన్న లైబ్రరీలా కట్టిన అరల్లో, ఎన్నో పుస్తకాలు. ఆ గదిలో అడుగుపెట్టిన వారు ఎవరైనా సరే, ఆ డిజైనర్ ను అభినందించకుండా ఉండలేరు. ఓ పక్క ఉద్వేగం, ఓ పక్క ఆనందం... అలా చూస్తూ ఉన్నాను. ఆయనకేదో ఫోన్ వచ్చింది, మాట్లాడారు. తర్వాత ఆయనే పలకరించి, నా రచనల గురించి అడిగారు. నేను రాసిన అహోబిల నృసింహ శతకం చూపించాను, తర్వాత 'సాహితీ యుగకర్త' అంటూ ఆయన మీద రాసిన కవిత... ఇలా కొన్ని చూసి, గతంలో వాట్స్ ఆప్ లో పంపినవి కూడా బాగున్నాయని, నా తెలుగు బాగుందని మెచ్చుకున్నారు. ఆయన నుంచి అందిన ప్రశంస నా పెన్నుకి, వెన్నుకి కొండంత బలం.

పెద్ద పెద్ద కళ్ళతో నేను అచ్చంగా వారి అమ్మాయిలా ఉన్నానట. వారి కోడల్ని పిలిచి, పరిచయం చేసారు. "నీకు గురువూ నువ్వే, శిష్యుడివీ నువ్వే... నీ మార్గం నువ్వే నిర్దేశించుకోవాలి..." అంటూ, జీవితానికి, కవిత్వానికి, వాళ్ళ నాన్నగారికి సంబంధించిన కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పారు. ఆయనతో మాట్లాడుతుంటే నడిచే విజ్ఞానఖనితో మాట్లాడిన అనుభూతి కలిగింది. పై ఫ్లాట్ లో ఉన్న వారి ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడే చూసాను ఆయనలో పదిలంగా ఉన్న పసిపాపని. అప్పటిదాకా జీవితసారాన్ని కాచి వడపోసినట్లు కనిపించిన ద్రష్ట ఈయనేనా అనిపించింది.

ఆయన సాహిత్యోపాసనకు, పరవశించి ఆయన ఇంట్లో పారాడేందుకు వచ్చిన దేవేరి భారతేనేమో... మనవరాలు ఆర్యభారతి. జగద్గురువు శంకరాచార్యుల వారి తల్లి 'ఆర్యాంబ.' సిరివెన్నెల గారూ, మనవరాల్ని అలాగే పిలుస్తారు. 'బంగారూ... ఎక్కడా...' అనంగానే, ఆటబొమ్మలతో సహా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆర్యాంబ. పాపాయికి ఏం తెలుసు ఆ తాతగారు ఎవరో? ధీమాగా దబాయించేస్తుంది, ఇంటికీ, ఆఫీస్ కి మొత్తం ఆమే మహారాణి. 'ఆడుకుందాం రా తాతా...' అంటుంది. 'రాసుకోవాలి బంగారూ ' అంటారు ఈయన. 'సరే, నేనూ వస్తా పద...' అంటుంది బుజ్జి భారతి. తాతని లాగి కుర్చీలో కూర్చోపెట్టి, ఆయన ఒళ్లో కాళ్ళు పెట్టుకుని, 'ఏదీ నామీద రాసిన పాట పాడు' అని పాడించుకుంది. పరమభాగావతుడికి భగవంతుడికి ఉండే చనువు వంటిది ఆ చనువు. ఎటువంటి అరమరికలూ లేవు. మనవరాలి మీద మనసారా రాసిన పాట ఆయన నోట వింటూ నేనూ పరవశించిపోయాను. బయట లోకానికి ఎంత గొప్పవారైనా, ఇంట్లోని వాళ్ళతో, పిల్లలతో ఇలా కలిసిపోతేనే... అసలైన జీవనమాధుర్యం తెలుస్తుందని, ఆయన ఆచరణలో చూపారు. ఆర్యాంబతో నన్ను 'అత్తా, అత్తా' అని పిలిపించారు. ఫోటోలు తీసుకుంటూ ఉంటే, 'ఏదమ్మాయ్, ఓ సెల్ఫీ తీసుకుందాం రా, ఇంతవరకూ నేను ఎవరితోనూ సెల్ఫీ దిగలేదు. మొదటిది నీతోనే !' అన్నారు. నాకు లోలోపల సంబరం.



ఆ పుణ్య దంపతుల దీవెనలు తీసుకుని, వారు పెట్టిన చక్కటి పులిహోర తిని వెనక్కు బయల్దేరాను. చాలు భగవాన్ చాలు... సిరివెన్నెల గారి డైరీలో నాకోసం ఒక అరగంటని దయతో కేటాయించి ఇచ్చావు, ఈ జన్మకిది చాలు...

(11.12.2016 న అనుకోకుండా సిరివెన్నెల గారిని కలిసిన అనుభూతి మీతో ఇలా పంచుకుంటున్నాను.)