Wednesday, February 15, 2017

మానవ సేవే మాధవ సేవ

ప్రేమ...ఎండా వానను కలిపే హరివిల్లు. ఆ హరివిల్లు రంగులు ఇరువురి జీవితాల్లో శాశ్వతంగా నిలచినప్పుడు, పెళ్ళనే రంగవల్లిలో లక్షణంగా వొదిగినప్పుడు జీవితం రమణీయం, రాగరంజితం. కానీ, విధి వశాన ,హరివిల్లులా, ప్రేమ కేవలం కొంత కాలమే విరిసి మటుమాయమయితే....ఆ మనసులు పడే బాధ వర్ణనాతీతం. అవే హరివిల్లు రంగులను పదే పదే అన్వేషిస్తూ...జీవితం శూన్య ఆకాశంలా...ఎండమావిలా...అనిపిస్తుంది.
అయితే ...ఈ రోజుల్లో ప్రేమ అన్న పదం హాస్యాస్పదంగా మారింది. సినిమాలు, టీవీ ల ప్రభావంతో తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లలు ప్రేమను 'తిండి, బట్ట, ఇల్లు...' వంటి కనీసావసరాలలో ఒకటిగా భావించి, విధిగా ప్రేమించాలేమో అని భ్రమ పడుతున్నారు. యువత కాలక్షేపం ప్రేమలు, చీకట్లో చెరువుగట్టు ప్రేమలు, కాపురాలు కూల్చే స్వార్ధపు ప్రేమలు, అసభ్య ప్రేమలు చూస్తే 'ప్రేమ' అన్న పదం వింటేనే రోత పుడుతోంది.
ప్రేమ విఫలం అయ్యింది. విపరీతమయిన నిరాశ, నిస్పృహ....గుండెలు పిండే బాధ . అమ్మాయి మోసం చేసింది. అసలు ఈ అమ్మాయిలే అంత. అమ్మాయిల్ని నమ్మకూడదు. అసలు దానికి విలువలు లేవు. అంతే...ఆ ప్రేమికుడి ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. నాణానికి మరో వైపులా , అమ్మాయి కోణం నుంచీ ఆలోచించే వాళ్ళు ఎంతమంది. అరచేతుల్లో పసిబిడ్డగా వోదిగినప్పటినుంచీ, అపురూపంగా, కళ్ళలో వత్తులు వేసుకు పెంచిన తల్లిదండ్రులు...తనకు చిన్న కష్టం కలిగితే విలవిల్లడిపోయి ఎన్నో మొక్కులు మొక్కి, తన ముచ్చటలు తీర్చేందుకు ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేసి, వాళ్ళ గుండెల మీద తన్ని, అమ్మాయి వచ్చెయ్యాలి. తెలిసీ తెలియని యువకుడు తనను బాగా చూసుకుంటాడా ? అసలు పోషించగలడా ? ప్రేమ పేరుతో బందిస్తాడా , స్వేచ్చని ఇస్తూ గౌరవిస్తాడా ? అతని తల్లిదండ్రులు తనను నిందిస్తే....ఒక వేళ కష్టపెడితే , ఎవరితో చెప్పుకోవాలి? ఇటువంటి సందేహాలన్నీ అధిగమించి, అమ్మాయికి మీ పై సంపూర్ణ విశ్వాసాన్ని అందించగలిగినప్పుడే , ఆ ప్రేమ సఫలం అవుతుంది. ఒకవేళ ప్రేమ విఫలం అయితే, ఆ అమ్మాయి మనసులో తాను అంత నమ్మకాన్ని కలిగించలేక పోయానని అర్ధం.
సరే, అయ్యిందేదో అయిపొయింది. ఒక అల తీరం దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్తవ్యమ్? ఆ అమ్మాయిని హృదయపూర్వకంగా మీరు ప్రేమించినట్లయితే ఆమెకు మీరు ఇచ్చే కానుక....టన్నుల కొద్దీ విఫల ప్రేమ కవితలు ...అంతేనా? అదే భావంలో, అదే వేదనలో ఆగిపోవడమేనా. ఇలా అంటున్నందుకు క్షమించాలి....ఒకటో ఆరో విఫల కవితలు పర్వాలేదు...కాని మీరు అటువంటి కవితలు రాసే ప్రతీ క్షణం నిరర్ధకం. కాలం ఎంతో విలువయినది. దాన్ని ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకూడదు. మరి ఏమి చెయ్యాలి?
మన జీవితాలని తిరిగి సవ్య దిశలో మలచుకోవాలి. ఇందుకు పెట్టుబడి...' దేహం, ప్రాణం, రక్తం, సత్తువ...' ఇంతకు మించిన సైన్యాలు విజయానికి అక్కర్లేదు. ఈ లోకంలో ప్రేమకు నోచుకోని ఆనాధాలు, రోగగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు ఎందరో ఉన్నారు. వారితో రోజులో ఒక్క గంట గడపండి చాలు. వారిని ఆత్మీయంగా పలకరించండి. బ్రతుకులోని మాధుర్యం తెలిసి వస్తుంది. ఇది మీరు ప్రేమించిన మనసుకు మీరిచ్చే ముగ్ద నివాళి. మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడండి. మీరు కోల్పోయిన ప్రేమ ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ఇది నిజం....మానవ సేవే మాధవ సేవ.

No comments:

Post a Comment